రేపు పిఠాపురంకు పవన్.. వారాహి విజయభేరి షెడ్యూల్ విడుదల
పిఠాపురంతో కలిపి మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. తొలి బహిరంగ సభ చేబ్రోలు రామాలయం సెంటర్ లో ఉంటుంది.
ఎన్నికలకు ముందుగానే విజయ భేరి మోగిస్తున్నారు పవన్ కల్యాణ్. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం) నుంచి పవన్ యాత్ర మొదలవుతుంది. నాన్ స్టాప్ గా రెండు వారాలపాటు కొనసాగుతుంది. ఇందులో 4 రోజులు కేవలం పిఠాపురం నియోజకవర్గానికే కేటాయించారు పవన్. ఆ తర్వాత తెనాలి నుంచి మొదలు పెట్టి రాజానగరంతో యాత్ర ముగిస్తారు. మొత్తం 14 రోజులపాటు ఆయన ప్రజల్లో ఉండే విధంగా షెడ్యూల్ రూపొందించారు.
"వారాహి విజయ భేరి"
— JanaSena Party (@JanaSenaParty) March 29, 2024
శ్రీ పవన్ కళ్యాణ్ గారి తొలి విడత ఎన్నికల ప్రచార పర్యటన వివరాలు..#VarahiVijayaBheri pic.twitter.com/gkwKIbO297
విజయభేరి యాత్ర షెడ్యూల్..
మార్చి 30 - ఏప్రిల్ 2 వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – యలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
ఏప్రిల్ 9 - పిఠాపురంలో ఉగాది వేడుకలు
ఏప్రిల్ 10 – రాజోలు
ఏప్రిల్ 11 – పి.గన్నవరం
ఏప్రిల్ 12 – రాజానగరం
పిఠాపురంతో కలిపి మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. పిఠాపురం పర్యటనలో భాగంగా శక్తి పీఠ క్షేత్రంలో ఉన్న పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూజలు చేయిస్తారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. తొలి విడత ప్రచారంలో ఐదు రోజు అక్కడే బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్‌తోనూ సమావేశమవుతారు.
తొలి బహిరంగ సభ చేబ్రోలు రామాలయం సెంటర్ లో ఉంటుంది. ఈ సభకోసం పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు జనసేన నేతలు. నాగబాబు ఈ వ్యవహారాన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారాయన. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభలు జరుగుతాయి.