వర్మ చేతిలో పవన్ భవిష్యత్తు?
మామూలుగానే వైసీపీ అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవటం పవన్‌కు అంత ఈజీకాదు. అలాంటిది వర్మ ఇండిపెండెంటుగా పోటీ చేస్తే పవన్‌కు గెలుపు కష్టమనే చెప్పాలి.
జనసేనలో మిగిలిన అభ్యర్థుల పరిస్థితి నియోజకవర్గాల్లో ఎలాగుందో అధినేత పవన్ కల్యాణ్ పరిస్థతి కూడా అలాగే ఉంది. పార్టీ అధినేతను కాబట్టి తాను నామినేషన్ వేయబోయే నియోజకవర్గంలో కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు టీడీపీ, బీజేపీ నేతలు, క్యాడర్ తనకు బ్రహ్మరథం పడతారని పవన్ అనుకున్నారేమో. కాని పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పిఠాపురంలో పవన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న గొడవలను ఎల్లో మీడియా పూర్తిగా తొక్కిపెడుతోంది. సోషల్ మీడియా ద్వారా నియోజకవర్గంలో జరుగుతున్నదేంటో ఎప్పటికప్పుడు జనాలకు తెలిసిపోతోంది.
ఇప్పుడు విషయం ఏమిటంటే పిఠాపురంలో టీడీపీ తరపున పోటీకి రెడీ అయిన మాజీ ఎమ్మెల్యే svsn వర్మకు చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారు. చివరి నిమిషంలో నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినట్లు చెప్పారు. అలాగే పిఠాపురంలో తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అప్పటి నుండి వర్మ మద్దతుదారులు నియోజకవర్గంలో మండిపోతున్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లోని తన మద్దతుదారులతో వర్మ సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశాన్ని టీడీపీకి సంబంధం లేకుండానే నిర్వహించారు. మాట్లాడిన మద్దతుదారులంతా వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించారు. పవన్ గెలుపోటములు వర్మపైనే ఆధారపడున్నాయి.
వర్మ ఇండిపెండెంటుగా పోటీ చేస్తే తామంతా పార్టీకి రాజీనామా చేసి మద్దతుగా నిలబడతామన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచిన విషయాన్ని మద్దతుదారులు వర్మకు గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ.. నాన్ లోకల్స్ కు జనాలు ఓట్లేయరని చెప్పారు. డైరెక్టుగా ప్రకటించకపోయినా ఇండిపెండెంటుగా పోటీ చేయటంపైనే వర్మ మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది. వర్మ గనుక ఇండిపెండెంటుగా పోటీ చేస్తే పవన్ గెలుపు కష్టమే.
ఎందుకంటే వైసీపీ తరపున పోటీ చేయబోతున్న కాకినాడ ఎంపీ వంగా గీత గట్టి అభ్యర్థి. నియోజకవర్గంలో ఆమెకు బంధుత్వాలు ఉండటమే కాకుండా చాలామందితో స్నేహ సంబంధాలున్నాయి. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా చేసినప్పుడు, అంతకుముందు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఉన్నప్పటి నుండి నియోజకవర్గంలోని చాలామందితో సన్నిహిత సంబంధాలున్నాయి. మామూలుగానే గీతను ఎదుర్కోవటం పవన్‌కు అంత ఈజీకాదు. అలాంటిది వర్మ ఇండిపెండెంటుగా పోటీ చేస్తే పవన్‌కు గెలుపు కష్టమనే చెప్పాలి. పవన్ భవిష్యత్ అంతా వర్మ చేతిలోనే ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.