Telugu Global
Andhra Pradesh

వారాహి సెకండ్ సీజన్ షెడ్యూల్ ఖరారు

మంగళగిరి జనసేన ఆఫీస్ లో షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరిపారు.

వారాహి సెకండ్ సీజన్ షెడ్యూల్ ఖరారు
X

ఏపీలో పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు, వారాహి యాత్ర ఫస్ట్ పార్ట్ ముగిసిన తర్వాత ఇంత తొందరగా ఆయన మరోసారి జనంలోకి వస్తారని ఎవరూ అనుకోలేదు. అయితే పవన్ మాత్రం స్పీడ్ మీదున్నారు. ఈనెల 9నుంచి వారాహి సెకండ్ సీజన్ మొదలవుతుంది. ఈసారి యాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతుంది.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్, వారాహి యాత్రలో ఆ రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తూర్పుగోదావరిలో మొదటి దశ యాత్ర పూర్తి చేసి, రెండో దశలో పశ్చిమపై ఫోకస్ పెంచారు. ఏలూరులో ఈనెల 9న వారాహి టూర్ తో పాటు భారీ బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మంగళగిరి జనసేన ఆఫీస్ లో షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరిపారు.


ముందుగా చర్చలు..

యాత్ర చేపట్టే ముందు, ఆయా నియోజకవర్గాల నాయకులతో పవన్ కల్యాణ్ చర్చిస్తున్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు తన ప్రసంగంలో పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించాల్సి ఉంది. ఈ చర్చల తర్వాత ఆయన వారాహి ఎక్కుతారు.

పార్ట్-2 పై అంచనాలు..

పవన్ కల్యాణ్ మాటలు జనం నమ్ముతున్నారా..? జగన్ పై ఆయన చేస్తున్న విమర్శలను స్వాగతిస్తున్నారా..? అనే అంశాలను పక్కనపెడితే పవన్ సభలకు మాత్రం జనం భాగానే వస్తున్నారు. అందుకే వారాహి యాత్ర పార్ట్-1 విజయవంతమైందని అంటున్నాయి జనసేన శ్రేణులు. మలివిడత యాత్ర ప్రకటనతో జనసైనికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

First Published:  7 July 2023 6:43 AM IST
Next Story