Telugu Global
Andhra Pradesh

ఆ కొండపై జగన్.. ఈ కొండపై అమర్నాథ్

విస్సన్నపేట గ్రామానికి రోడ్ లేకుండా చేశారని, కానీ మంత్రి అమర్నాథ్ అనుచరులు వేసిన వెంచర్ కి మాత్రం 100 అడుగుల రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు పవన్. విస్సన్నపేటలో దళితుల భూములు, కొండ భూములను అన్యాయంగా ఆక్రమించారని ఆరోపించారు.

ఆ కొండపై జగన్.. ఈ కొండపై అమర్నాథ్
X

రుషికొండను సీఎం జగన్ పిండి పిండి చేస్తుంటే.. మంత్రి అమర్నాథ్ మరో కొండపై గెస్ట్ హౌస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో భాగంగా అనకాపల్లిలో పర్యటించిన ఆయన కొండపై అమర్నాథ్ గెస్ట్ హౌస్ ని చూసి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ప్రకృతి వనరుల్ని నాశనం చేసి వాల్టా చట్టానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ..

పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన సీఎం జగన్ ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు పవన్ కల్యాణ్. కొండలు, ప్రభుత్వ భూములు దోచుకోవడమే వైసీపీ నాయకులు టార్గెట్ గా పెట్టుకున్నారని అన్నారు. అనకాపల్లిలో పర్యటించిన ఆయన, విస్సన్నపేటలో కొండల మధ్య మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అనుచరులు వేసినట్టుగా చెబుతున్న లే అవుట్ ని పరిశీలించారు. 609 ఎకరాల్లో వేసిన ఈ లే అవుట్ కోసం నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపించారు.


విస్సన్నపేటకు రోడ్ లేదు..

విస్సన్నపేట గ్రామానికి రోడ్ లేకుండా చేశారని, కానీ మంత్రి అమర్నాథ్ అనుచరులు వేసిన వెంచర్ కి మాత్రం 100 అడుగుల రోడ్ వేసుకున్నారని మండిపడ్డారు పవన్. విస్సన్నపేటలో దళితుల భూములు, కొండ భూములను అన్యాయంగా ఆక్రమించారని, కొండ నుంచి జాలువారే వర్షపు నీటి పరీవాహక ప్రాంతాన్ని మూసేశారని ఆరోపించారు. రంగబోలు రిజర్వాయర్‌ కు వెళ్లే కాలువలు, వాగులు మూసేసి ఎలాంటి అనుమతులు లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు. మంత్రి అనుచరులు వేసిన వెంచర్‌ విలువ రూ.13 వేల కోట్ల వరకు ఉంటుందని, అంత పెద్ద దోపిడీ కోసం ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు చెరబడుతున్నారన్నారు పవన్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

First Published:  15 Aug 2023 7:45 AM IST
Next Story