పవన్ లో మొదలైన భయం.. సాక్ష్యం ఇదే
పిఠాపురం తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని అన్నారు పవన్. ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులకు చెప్పారు.
జగన్, చంద్రబాబు.. ఆఖరికి లోకేష్ ప్రచార యాత్ర మొదలు పెట్టినా తమ సొంత నియోజకవర్గాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన ఉండేట్టు ప్లాన్ చేసుకుంటారు. రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి.. అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిచ్చేలా యాత్రలు చేస్తారు. ఈమధ్య చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా తన యాత్రలు ముగించుకుని మంగళగిరికే ఫిక్స్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ బరిలో దిగారు. రాష్ట్రవ్యాప్త పర్యటనకోసం వారాహి దుమ్ము దులిపిన ఆయన.. ముందుగా పిఠాపురంలో యాత్ర పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. మూడురోజులపాటు పిఠాపురం చుట్టేస్తానని, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళ్తానంటున్నారు పవన్.
వారాహి రీఎంట్రీ..
వారాహి రీఎంట్రీపై ఇదివరకే వార్తలొచ్చినా.. ఇప్పుడు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోటీ చేయాలనుకుంటున్న పిఠాపురం నుంచే యాత్ర మొదలవుతుంది. పిఠాపురం శక్తిపీఠంలో పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి అనంతరం పవన్ వారాహి ప్రచార రథంపైకి ఎక్కుతారు. పిఠాపురంలో మొత్తం మూడు రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో ఇప్పటికే పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పిఠాపురం తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని అన్నారు పవన్. ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులకు చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని, ఈ విజయ నాదం రాష్ట్రం నలువైపులా వినిపించాలని తెలిపారు పవన్. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడం పై పూర్తి అవగాహనతో ఉండాలని పిఠాపురం నాయకులకు సూచించారు.
భయం భయం..
గాజువాక, భీమవరం కాదని ఈసారి పవన్ పిఠాపురంను ఎంపిక చేసుకున్నారు. అయితే వైసీపీ అప్పటికే ఎంపీ వంగా గీతకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కొంతమంది జనసేన నేతలు కూడా వైసీపీలో చేరారు. టీడీపీ నేత వర్మ రెబల్ గా మారడంతో పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీ హామీతో వర్మ కూల్ అయినా పూర్తి స్థాయిలో తనకు సహకరిస్తారనే నమ్మకం పవన్ లో లేదు. పైగా వైసీపీ ఆ స్థానంపై ఫోకస్ పెట్టిందనే భయం పవన్ లో రోజురోజుకీ ఎక్కువవుతోంది. అందుకే వారాహి రీఎంట్రీ కూడా అక్కడినుంచే ప్లాన్ చేసుకున్నారు. తన ఓటమికోసం వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని, వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నాలని స్థానిక నాయకులకు చెబుతున్నారు పవన్.