Telugu Global
Andhra Pradesh

ప్రశాంత్‌ కిషోర్‌తో బాబు భేటీ.. అసంతృప్తిలో జనసేనాని!

ఇదే విషయమై పవన్‌కల్యాణ్‌ సైతం తన సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం జనసేనను లైట్‌గా తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన కామెంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్‌ కిషోర్‌తో బాబు భేటీ.. అసంతృప్తిలో జనసేనాని!
X

చంద్రబాబు, లోకేశ్‌.. జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను పెద్దగా లెక్క చేయట్లేదా..? తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రశాంత్‌ కిషోర్‌ను తెలుగుదేశం పొలిటికల్‌ స్ట్రాటజిస్టుగా నియమించుకుంటున్న విషయం మిత్రపక్షమైన జనసేనకు తెలియకపోవడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ప్రశాంత్‌ కిషోర్‌ విజయవాడకు వచ్చిన టైమ్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్ సైతం విజయవాడలోనే ఉన్నారు. కానీ, చంద్రబాబు, ప్రశాంత్‌ కిషోర్‌ల భేటీపై జనసేనానికి కనీస సమాచారం కూడా లేదు. ప్రశాంత్‌ కిషోర్‌ విజయవాడ వచ్చేంతవరకు ఈ తతంగమంతా పూర్తి రహస్యంగా జరిగింది.

ఇదే విషయమై పవన్‌కల్యాణ్‌ సైతం తన సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం జనసేనను లైట్‌గా తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన కామెంట్స్‌ చేసినట్లు తెలుస్తోంది. జనసేన విషయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చర్చిస్తున్న తనకు.. పీకేతో సంప్రదింపుల విషయమై సమాచారం ఇవ్వాల్సి ఉండాలని పవన్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇక పవన్‌కల్యాణ్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కాపు ప్రతినిధుల్లో ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లోని కాపుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో తమకు తగిన ప్రాముఖ్యతను కోరుకుంటున్న కాపులు.. తెలుగుదేశం పార్టీకి పవన్‌కల్యాణ్‌ బేషరతుగా మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పదవిలో తమ నాయకుడు ఉండాలనేది కాపుల చిరకాల కోరిక. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కలిసి అధికారంలోకి వస్తే తమకు కీలక పదవులు ఉండాలని ఆ సామాజికవర్గం నేతలు ఆశిస్తున్నారు. ఇటీవల చెగొండి హరిరామజోగయ్య రాసిన లేఖ కూడా ఇవే అభిప్రాయాలను ప్రతిబింబించింది. కానీ, యువగళం ముగింపు సభకు పిలవగానే వెళ్లిన పవన్‌కల్యాణ్‌.. సీఎం పదవి ఆశించడం లేదని చేసిన ప్రకటన కాపుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. చంద్రబాబే సీఎం అంటూ లోకేష్‌ చేసిన ప్రకటన సైతం వారిలో ఆగ్రహానికి దారి తీసింది. సీఎం పదవి కాపులకు దక్కనప్పుడు అధికారంలో వైసీపీ ఉంటే ఏంటి.. తెలుగుదేశం ఉంటే ఏంటి అనే అభిప్రాయం కాపుల్లో కనిపిస్తోంది.

ప్రశాంత్‌ కిషోర్‌, చంద్రబాబు భేటీ తర్వాత కాపుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన సర్వే సాకు చూపి జనసేనకు వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని కాపు నేతలు అనుమానిస్తున్నారు. తెలుగుదేశం కోసం జనసేన కానీ, జనసేన కోసం తెలుగుదేశం కాదన్న చంద్రబాబు, లోకేష్‌ల వైఖరి సైతం కాపులను పునరాలోచనలో పడేలా చేసింది.

First Published:  26 Dec 2023 1:02 PM IST
Next Story