Telugu Global
Andhra Pradesh

టార్గెట్ జగన్.. ఈసీ చర్యలు తీసుకోవాలన్న పవన్

ఏపీలో ఇంటింటి సర్వే మొదలైంది. ఈ సర్వేను బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో)లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ సర్వేలో వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారని ఆరోపిస్తున్నారు పవన్ కల్యాణ్.

టార్గెట్ జగన్.. ఈసీ చర్యలు తీసుకోవాలన్న పవన్
X

వాలంటీర్ల విషయంలో తాను చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకునేది లేదని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని, చిత్రవధ చేసుకోవచ్చని తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్.. మరోసారి వాలంటీర్లపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లకు ఎన్నికల ప్రక్రియ విధులు అప్పగిస్తోందని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ వేశారు పవన్.


వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వే మొదలైంది. అయితే ఈ సర్వేను బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్వో)లు చేపట్టాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఓటరు కార్డులో తప్పులున్నాయా లేదా, ఆధార్ తో అనుసంధానం అయిందా లేదా అనేది వీరు చెక్ చేస్తారు. కానీ ఈ సర్వేలో వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారని ఆరోపిస్తున్నారు పవన్ కల్యాణ్. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రక్రియ రాజకీయాలకు వేదిక అయిందన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలంటున్నారు.

ఇంటింటి సర్వేలో వాలంటీర్లు భాగమవుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా మూడు రోజులుగా వార్తలిస్తోంది. ఈ వార్తల్ని కోట్ చేస్తూ పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. పవన్ టార్గెట్ సీఎం జగన్ అని తేలిపోయింది. వాలంటీర్ల విషయంలో నేరుగా పవన్ ని జగన్ టార్గెట్ చేస్తూ వెంకటగిరిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు వాలంటీర్ల విషయాన్ని తేల్చుకోడానికి పవన్ సిద్ధమయ్యారు. అందుకే ఈసీ కలుగజేసుకోవాలంటూ ట్వీట్ వేశారు.

First Published:  22 July 2023 8:49 PM IST
Next Story