వివాదాలతో ఓట్లు పడతాయా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను నమ్ముకోవటం కన్నా వివాదాలనే బాగా నమ్ముకున్నట్లున్నారు. అందుకనే పదేపదే వివాదాలను రేపుతు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను నమ్ముకోవటం కన్నా వివాదాలనే బాగా నమ్ముకున్నట్లున్నారు. అందుకనే పదేపదే వివాదాలను రేపుతు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బ్యానర్ కథనాలు అందించేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంది కాబట్టి పవన్ ఆరోపణలు, విమర్శలు బాగా హైలైట్ అవుతున్నాయి. షూటింగ్‌ల గ్యాప్‌లో కార్యక్రమాలు పెట్టుకుని పార్టీ నేతలతోనో లేకపోతే జనవాణి పేరుతో ప్రజలను ఎప్పుడో ఒకసారి కలుస్తున్నారు.
ఎంత వీలుంటే అంత ఆ రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వంపై బురదచల్లేయటం, అవకాశముంటే వివాదం చేయటమే పనిగా పెట్టుకున్నారు. మొన్నటి వైజాగ్ పర్యటనలో జరిగిందిదే. విశాఖలో జరిగిన ప్రజాగర్జన కార్యక్రమం ముగించుకుని ఎయిర్ పోర్టుకు వచ్చిన మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడులుచేశారు. ఆ తర్వాత ఆ విషయం ఎంత వివాదమైందో అందరికీ తెలిసిందే. తమ పార్టీ వాళ్ళే మంత్రుల కార్లపైన దాడిచేస్తే దాన్ని ఉల్టాగా తన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకున్నదని, తమ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులుపెట్టిందంటు నాలుగు రోజులు గోలగోల చేసేశారు.
అంతకుముందు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు విషయంలో కూడా ఎంత గోల చేశాడో అందరు చూసిందే. అంబేద్కర్ పేరు పెట్టడంపై వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో చాలా మందిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేశారు. అందులో జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ పోలీసులు వాట్సప్ చాటింగ్ ఆధారాలతో అరెస్టు చేస్తే కూడా నానా రచ్చ చేశారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటు కొద్ది రోజులు గోల చేశారు.
ఇవన్నీ చూస్తుంటే వివాదాలతోనే జనాలను ఆకట్టుకోవటమో లేకపోతే సానుభూతితోనో ఓట్లు రాబట్టుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్లుంది. తాను జనాల్లో తిరక్కుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రావటంలేదని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకు అస్తమానం జనాల్లో తిరగాల్సిన అవసరం ఏముంటుంది ? అధికారంలోకి రావాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు రెగ్యులర్‌గా జనాల్లో ఉండాలి. ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్న వీళ్ళే జనాల్లో తిరగనప్పుడు ఇక జగన్‌కి మాత్రం ఏమవసరం? మరి తాను నమ్ముకున్న వివాదాలతో పవన్ ఏ మేరకు లాభపడతారో చూడాల్సిందే.