ఇటలీకి పవన్.. జనసేన బాధ్యతలు నాదెండ్లకు
ఆయన లేని సమయంలో ఇక్కడ పార్టీ వ్యవహారాలను నడిపే బాధ్యత నాదెండ్లకు అప్పగించారు. ఈలోగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా నాదెండ్లకే పూర్తి అధికారాలుంటాయి. అసలింతకీ పవన్ ఇటలీ ఎందుకు వెళ్తున్నారు..? ఎన్నిరోజులుంటారు..?

పవన్ కల్యాణ్ పరోక్షంలో జనసేన వ్యవహారాలను నడిపించేది నాదెండ్ల మనోహరే. కానీ ఈసారి అధికారికంగా ఆయన్ను ఇన్ చార్జ్ గా నియమించి పవన్ కల్యాణ్ ఎవరికీ అందుబాటులో లేకుండా ఇటలీ వెళ్తున్నారు. ఆయన లేని సమయంలో ఇక్కడ పార్టీ వ్యవహారాలను నడిపే బాధ్యత నాదెండ్లకు అప్పగించారు. ఈలోగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా నాదెండ్లకే పూర్తి అధికారాలుంటాయి. అసలింతకీ పవన్ ఇటలీ ఎందుకు వెళ్తున్నారు..? ఎన్నిరోజులుంటారు..?
వరుణ్ తేజ్ పెళ్లికోసం..
హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు తనయుడు హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఖరారైన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు కూడా విడుదలయ్యాయి. ఇటలీలోని టుస్కానీ నగరంలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అయ్యారు. నవంబర్-1న ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలకోసం మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లబోతోంది. అన్న కొడుకు పెళ్లి వేడుక కోసం పవన్ కల్యాణ్ కూడా ఇటలీ వెళ్తున్నారు. ఈనెల 17న పవన్ ఇటలీ బయలుదేరతారని సమాచారం. లాంగ్ హాలిడే ట్రిప్ కావడంతో ఇక్కడ జనసేన బాధ్యతల్ని నాదెండ్లకు అప్పగిస్తున్నారని తెలుస్తోంది.
కుదిరితే బాబుతో ములాఖత్..
ఈనెల 17న ఇటలీ బయలుదేరబోతున్న పవన్ కల్యాణ్.. కుదిరితే ఆ లోపు చంద్రబాబుతో ములాఖత్ అవుతారని అంటున్నారు. ఈమేరకు ములాఖత్ కోసం పవన్ తరపున జైలు అధికారులకు అభ్యర్థనలు వెళ్లాయి. పోనీ ఆలోపు చంద్రబాబుకి బెయిలొచ్చినా, క్వాష్ పిటిషన్ సక్సెస్ అయినా బయటే వారి భేటీ ఉంటుంది. చంద్రబాబు జైలుకి వెళ్లిన తర్వాత ఒకే ఒక్కసారి పవన్ ఆయన్ను కలసి వచ్చారు. టీడీపీతో పొత్తు ప్రకటించారు. మళ్లీ రెండోసారి ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే జనసేనాని ఇటలీ టూర్ తర్వాత చంద్రబాబు, పవన్ భేటీ ఉంటుంది.