మరోసారి రెండు చోట్ల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ!
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బరిలో ఉంటే మరి కొన్ని నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇప్పటికే రెండు నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.
ఏపీలో జనసేనను ఈ సారి ఎలాగైనా గెలిపించాలని పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఉండే వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసేందుకు అవసరం అయితే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఈ సారి ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొన్నది. తాను గెలవడమే కాకుండా.. తాను పోటీ చేసే నియోజకవర్గాల వల్ల మరి కొందరు జనసేన అభ్యర్థులను కూడా గెలిపించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
గతంలో మాదిరిగానే ఈ సారి కూడా రెండు నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల నుంచే ఈ సారి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ పెద్దగా ప్రభావం చూపించలేక ఓడిపోయారు. అయితే ఈ సారి మాత్రం ఆ తప్పు జరగకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బరిలో ఉంటే మరి కొన్ని నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇప్పటికే రెండు నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పవన్ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో చిరంజీవి కుటుంబానికి దగ్గరగా ఉన్న కన్నబాబు.. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు వైసీపీ మీద విమర్శలు చేసినా కన్నబాబు తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పడు పవన్ కల్యాణే తనకు రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి అయితే ఏం చేస్తారా అనే ఆసక్తి నెలకొన్నది.
కాకినాడ రూరల్‌తో పాటు పిఠాపురం నుంచి కూడా పవన్ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొన్ని అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వంగా గీత బరిలో ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ కనుక ఇక్కడి నుంచి కూడా పోటీలో ఉంటే.. గీత బరిలోకి దిగుతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల కాకినాడ జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు.. కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆ రెండింటినీ సెలెక్ట్ చేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోవడం పవన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. తరచూ వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తుంటారు. ఈ సారి కనుక చట్ట సభకు ఎన్నిక కాకపోతే పార్టీని నడిపించడం కష్టం అని పవన్ భావిస్తున్నారు. అందుకే సేఫ్‌గా ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకొని.. గెలుపు కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.