Telugu Global
Andhra Pradesh

వర్మకు థ్యాంక్స్.. మీ ప్రేమకు కృతజ్ఞతలు

పిఠాపురంలో మార్పుకోసం ముందడుగు వేసి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీర మహిళకు, టీడీపీ, బీజేపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు అంటూ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.

వర్మకు థ్యాంక్స్.. మీ ప్రేమకు కృతజ్ఞతలు
X

ఇల్లు అలకగానే పండగ కాదు. కానీ పవన్ కల్యాణ్ లాంటి కొందరు నేతలు మాత్రం ఎన్నికలైపోగానే తాము గెలిచేసినట్టు ఫీలయిపోతున్నారు. పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో ఆయన ఎన్నికల్లో గెలిచినట్టు హామీల వర్షం కురిపిస్తున్నారు. పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా చేస్తానంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.


పిఠాపురంలో మార్పుకోసం ముందడుగు వేసి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీర మహిళకు, టీడీపీ, బీజేపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు అంటూ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్. పోలింగ్ తర్వాతి రోజు ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసి వెళ్లిన పవన్.. ఇప్పుడు తీరిగ్గా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో రాత్రి 10 వరకు పోలింగ్ జరిగిందని, రికార్డ్ స్థాయిలో 86.63 శాతం పోలింగ్ జరిగిందని, అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు పవన్ కల్యాణ్.

వర్మకు స్పెషల్ థ్యాంక్స్..

టీడీపీ రెబల్ అభ్యర్థిగా వర్మతో తనకు ఇబ్బందులు తప్పవని పవన్ అంచనా వేసినా, ఎన్నికల వేళ ఆ ముప్పు లేకపోవడంతో సంబరపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. భవిష్యత్తులో ఆయన కచ్చితంగా ప్రజల తరపున పనిచేస్తారని కూడా తన ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.

ఇక సినీ కుటుంబ సభ్యుల ప్రేమ తనను కదిలించిందని కూడా చెప్పుకొచ్చారు పవన్. నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ, అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ తనకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. తన తరపున పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేసిన నటులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్.

First Published:  16 May 2024 9:47 PM IST
Next Story