పవన్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా?
సీట్ల షేరింగులో జనసేనకు 50-60 సీట్లు ఇవ్వాల్సిందే అని లోకేష్‌తో పవన్ కచ్చితంగా చెప్పేశారట. రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లోనే పది సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం మొదలైంది.
చంద్రబాబునాయుడు జైలులో ఉన్న సమయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్‌గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమిని తానే ముందుండి నడిపిస్తానని పవన్ డైరెక్టుగానే ప్రకటించేశారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు జైలుకు వెళ్ళటంతో టీడీపీ బలహీనపడిందని పవన్ బహిరంగసభలోనే చెప్పారు. బలహీనపడిన పార్టీని ఆదుకునేందుకే తాను టీడీపీకి మద్దతిచ్చినట్లు చెప్పారు.
ఇప్పుడు విషయం ఏమిటంటే టీడీపీ బాగా బలహీనపడిందని పదేపదే చెబుతున్న పవన్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. సీట్ల షేరింగులో జనసేనకు 50-60 సీట్లు ఇవ్వాల్సిందే అని లోకేష్‌తో కచ్చితంగా చెప్పేశారట. రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లోనే పది సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, కడప జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆళ్ళగడ్డ, అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాలను కోరుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది.
జనసేన బలహీనంగా ఉన్న రాయలసీమలోనే పది నియోజకవర్గాలు కోరుతున్నదంటే ఇక బలంగా ఉందని అనుకుంటున్న ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఇంకెన్ని సీట్లడగాలి? అందుకనే 50 నుండి 60 సీట్లు కావాలని పవన్ గట్టిగా అడిగినట్లు బాగా ప్రచారమవుతోంది. ఇదే నిజమైతే టీడీపీ దీనస్థితిని పవన్ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే అనుకోవాలి. ఇప్పుడు సమస్య ఏమిటంటే పవన్ అడిగినన్ని సీట్లిచ్చినా టీడీపీకి నష్టమే.. ఇవ్వకపోయినా నష్టమే. అడిగినన్ని సీట్లిస్తే ఒకరకమైన నష్టం. ఎలాగంటే వదులుకున్న సీట్లలో అత్యధికం వైసీపీనే గెలుస్తుందని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. ఇవ్వకపోతే ప్రచారం, ఓట్ల బదిలీ లాంటి సమస్యలు తప్పవు.
దాంతో ఏమిచేయాలో లోకేష్ అండ్ కోకు అర్థంకావటంలేదని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. జైలులో ఉన్న కారణంగా చంద్రబాబు ఏమీచేయలేని స్థితిలో ఉండిపోయారు. రెండు పార్టీల్లో జరుగుతున్న డెవలప్మెంట్లను చూస్తుంటే లోకేష్‌పై పవన్ సైకలాజికల్‌గా పై చేయి సాధించినట్లే ఉంది. పవన్ ది అప్పర్ హ్యాండ్ అయ్యేకొద్దీ లోకేష్ అండ్ కోలో అసహనం పెరిగిపోవటం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.