మా అన్నయ్య జోలికొస్తే.. పవన్ పవర్ ఫుల్ డైలాగ్
చిరంజీవి అజాత శత్రువే కావొచ్చు. కానీ కూటమికి మద్దతిచ్చి ఆయన మిగతావారికి శత్రువుగా మారిపోయారు.
మా కుటుంబం జోలికొస్తే నేను మనిషిని కాదు
మా అమ్మని తిట్టించిన టీడీపీని వదలను
మా అన్నయ్య జోలికొస్తే నేను సహిస్తూ ఊరుకోను..
ఇలాంటి డైలాగులు పవన్ కి అలవాటే.. పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం ఆ తర్వాత పిల్లిలా మారిపోయి తిట్టినవారి చంకలోనే ఎక్కడం ఆయనకు రివాజు. ఇటీవల సీఎం జగన్ కూడా చంద్రబాబు చంకలో పవన్ పిల్లి అంటూ విమర్శించారు. తాజాగా మరోసారి పవన్, తన అన్నయ్యకోసం పవర్ ఫుల్ డైలాగు కొట్టారు. చిరంజీవి జోలికొస్తే వైసీపీలో ఎవరినీ వదలబోనని హెచ్చరించారు.
అసలేమైంది..?
ఇటీవల కూటమి నేతలకు మద్దతుగా చిరంజీవి వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. చిరంజీవి ముసుగు తొలగించారని, ఆయన కూడా కూటమితో కుమ్మక్కయ్యారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విమర్శలతో పవన్ కల్యాణ్ కి కోపం వచ్చింది. తన అన్నను అంటే ఊరుకోనని తేల్చి చెప్పారు పవన్. చిరంజీవి అజాత శత్రువని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, ఆయన జోలికొస్తే సహించేది లేదన్నారు. గతంలో మూడు రాజధానుల నిర్ణయం మంచిదేనని ఆయనతో అనుకూలంగా మాట్లాడించినా.. తమ్ముడిగా సహించానని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో చిరంజీవి, రజినీకాంత్ వంటి గొప్పవారికే మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు పవన్. రాష్ట్రంలో 50 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉండి కూడా ప్రజల భవిష్యత్తు కోసమే తాను వెనక్కి తగ్గానని వివరించారు. జనసేన పోటీ చేస్తోంది 21 స్థానాల్లో కాదని, 175 అని గుర్తుపెట్టుకోవాలన్నారు పవన్.
చిరంజీవిని బయటకు తెచ్చిందెవరు..?
వాస్తవానికి చిరంజీవిని బయటకు తెచ్చిందే పవన్. జనసేన విరాళంతో ఆయనతో ఫొటోలు దిగి, వాటిని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి పూర్తిగా తన ముసుగు తొలగించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా వీడియోలు విడుదల చేశారు. రాజకీయాల్లోకి వస్తే, విమర్శలు ప్రతి విమర్శలు సహజం. పోనీ విమర్శలు స్వీకరించేంత ధైర్యం లేకపోతే రాజకీయాల జోలికి రాకుండానే ఉండాల్సింది. అంతే కానీ, తాము ప్రత్యర్థులను విమర్శిస్తాం, ఎదుటి వాళ్లు మాట అంటే పడేది లేదు అంటే కుదరదు. చిరంజీవి అజాత శత్రువే కావొచ్చు. కానీ కూటమికి మద్దతిచ్చి ఆయన మిగతావారికి శత్రువుగా మారిపోయారు.