ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. జనసేన ప్రభుత్వం వస్తుంది
జనం ఆశీస్సులతో ఒక రోజు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు. అందమైన శిల్పం రావాలంటే ఉలి దెబ్బలు తినాలని, ప్రతి ఓటమి మంచి విజయానికి నాంది కావాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు పవన్ కల్యాణ్. జనసేన 10వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన.. జనసైనికులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని వారికి భరోసా ఇచ్చారు. అందరూ కలసికట్టుగా ఉండాలని, అలా ఉంటేనే జనసేనను అధికారంలోకి తీసుకు రాగలం అని అన్నారు పవన్ కల్యాణ్.
2014లో పార్టీ పెట్టినప్పుడు తనతోపాటు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారని, ఇప్పుడు ప్రతి చోట 500 మంది కార్యకర్తల్ని సంపాదించుకున్నామని, 6 లక్షలమంది క్రియాశీలక సభ్యుల్ని పొందామని చెప్పారు. మనల్ని నమ్మి వెనక ప్రజలు వస్తున్నారని చెప్పారు.
పదేళ్లలో మాటలు పడ్డామని, జనం ఆశీస్సులతో ఒక రోజు జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు. అందమైన శిల్పం రావాలంటే ఉలి దెబ్బలు తినాలని, ప్రతి ఓటమి మంచి విజయానికి నాంది కావాలని అన్నారు.
గతంలో తమ కుటుంబంలో ఒక రాజకీయ ప్రస్థానం మొదలైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చాయో అందరికీ తెలుసని, తన కుటుంబంలో ఎవరూ పాలిటిక్స్ లో లేకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. ఎప్పటికీ జనాలకు అండగా ఉంటానన్నారు.
ప్రజల ఆశీస్సులే తనకు ఎప్పటికప్పుడు ధైర్యాన్నిస్తాయన్నారు. అన్ని కులాల్లో తనకు అభిమానులున్నారని, తాని ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తిని కాదని, కానీ తాను కాపు కులంలో పుట్టానని, అది తన ఛాయిస్ కాదని చెప్పారు పవన్ కల్యాణ్. పరస్పరం అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఒక్క కులం వల్ల ఏదీ జరగదని, అందరూ కలసి పోరాటం చేయాలన్నారు.