Telugu Global
Andhra Pradesh

మోదీ భుజంపై తుపాకీ.. పవన్ కొత్త వ్యూహం

ఇన్నాళ్లూ జగన్ పథకాలపై విమర్శలు చేసిన బాబు, పవన్.. ఇప్పుడు మోదీతో పోలుస్తూ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. యుద్ధాన్ని మోదీ వర్సెస్ జగన్ అన్నట్టు మార్చేశారు.

మోదీ భుజంపై తుపాకీ.. పవన్ కొత్త వ్యూహం
X

"అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి .. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసురుడిని తీసేయటం కష్టం కాదు." చిలకలూరి పేట కూటమి సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలివి. అంతా మోదీ చేసేట్టయితే ఇక కూటమిలో టీడీపీ, జనసేన దేనికి..? నిన్న మొన్నటి వరకూ జగన్ ని అది చేస్తా, ఇది చేస్తా, భయాన్ని పరిచయం చేస్తానంటూ రెచ్చిపోయిన పవన్.. ఈరోజు మోదీని స్టేజ్ పై చూసుకుని మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ని గురిపెట్టేందుకు మోదీ భుజంపై తుపాకి పెట్టారు జనసేనాని. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని చెప్పారు.


అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చిందని సెలవిచ్చారు పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్డీఏ కూటమి తిరిగి కలవడం వల్ల 5 కోట్ల మందికి విముక్తి లభించిందని చెప్పారు. మూడోసారి ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆయనకు ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం పలుకుతున్నామని అన్నారు పవన్. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందన్నారు.

బాబు రాజ్యం కాదు.. రామరాజ్యం

నిన్నటి దాకా బాబు వీరుడు, శూరుడు, క్లెమోర్ మైన్లు పేలినా కారులోనుంచి లేచొచ్చిన ఘనుడు అంటూ ఆకాశానికెత్తేసిన పవన్.. ఇప్పుడు మోదీ భజన చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఏపీలో రామరాజ్య స్థాపన జరగబోతోందన్నారు పవన్. దేశమంతా డిజిటల్‌ ట్రాన్సక్షన్‌ జరుగుతుంటే ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయిందన్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని అన్నారు. ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం అంటూ పంచ్ డైలాగులు కొట్టారు పవన్.

వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం బాబు, పవన్ ఇద్దరి ఉమ్మడి టార్గెట్. ఇన్నాళ్లూ జగన్ పథకాలపై విమర్శలు చేశారు వారిద్దరు, ఈరోజు మోదీని చూడగానే ఆయనతో పోలిక చెబుతూ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. యుద్ధాన్ని మోదీ వర్సెస్ జగన్ అన్నట్టు మార్చేస్తున్నారు. మరి కూటమిలో మోదీ చేరడం వారికి వరమా..? శాపమా..? అనేది త్వరలో తేలిపోతుంది.

First Published:  17 March 2024 6:29 PM IST
Next Story