Telugu Global
Andhra Pradesh

సైలెంట్ గా పవన్.. అంబటిని గిల్లి వదిలేసినట్టేనా..?

సహజంగా ఇలాంటి విషయాల్లో పవన్ తొందరగానే రియాక్ట్ అవుతారు, కానీ అంబటి ఎపిసోడ్ లో ఎందుకో మౌనంతో రెచ్చగొడుతున్నారు. అటు అంబటి కూడా 'బ్రో' వ్యూహంలో చిక్కుకుపోయారు.

సైలెంట్ గా పవన్.. అంబటిని గిల్లి వదిలేసినట్టేనా..?
X

ఆమధ్య పవన్ కల్యాణ్ చెప్పుల ఎపిసోడ్ ఎలా కొనసాగిందో అందరికీ తెలుసు. పవన్ ఒక చెప్పు చూపించడం, మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం, ఆ తర్వాత పవన్ తన చెప్పులు గుడి దగ్గర పోయాయని చెప్పడం, చెప్పులు కాదు ముందు పార్టీ గుర్తు పోయింది చూసుకో అంటూ పేర్ని కౌంటర్ ఇవ్వడం.. ఇదంతా ఓ ఎపిసోడ్ లా నడిచింది. పవన్, పేర్ని నాని పోటా పోటీగా ప్రెస్ మీట్లు పెట్టుకుని కౌంటర్లిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు శ్యాంబాబు ఎపిసోడ్ లో మాత్రం మంత్రి అంబటి ఒంటరి యుద్ధం చేస్తున్నారు. 'బ్రో' సినిమాలో శ్యాంబాబు అంటూ గిల్లి వదిలేశారు పవన్. దీంతో మంత్రి అంబటికి బాగానే కోపం వచ్చింది. ట్వీట్లు, ప్రెస్ మీట్లు, పవన్ సినిమాకి టైటిళ్లు అంటూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు అంబటి.

అటునుంచి పవన్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. పోనీ పవన్ సినిమాలతో బిజీగా ఉన్నారా అంటే అదీ లేదు, మంగళగిరిలో తెనాలి ప్రజలతో మీటింగ్ పెట్టుకున్నారు. జగన్ పై సెటైర్లు వేశారే కానీ, అంబటి వ్యవహారాన్ని టచ్ చేయలేదు. పవన్ పెళ్లిళ్లు, పిల్లలు అంటూ అంబటి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా, సినిమా టైటిల్స్ ప్రకటించినా కూడా పవన్ మాత్రం మాట తూలలేదు. సహజంగా ఇలాంటి విషయాల్లో పవన్ తొందరగానే రియాక్ట్ అవుతారు, కానీ అంబటి విషయంలో ఎందుకో మౌనంతో రెచ్చగొడుతున్నారు. అటు అంబటి కూడా 'బ్రో' వ్యూహంలో చిక్కుకుపోయారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ కలెక్షన్ల లెక్కలు చెబుతున్నారు, 'బ్రో' నామస్మరణ విడిచిపెట్టడంలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆయన అందరికీ టార్గెట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మతో వైసీపీ తీయించేవి కళాఖండాలు, పవన్ సినిమాలు మాత్రం ఫ్లాప్ షోలా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 'బ్రో' కలెక్షన్లు చెప్పడం ఆపేసి, ముందు పోలవరం సంగతి చూడండి అంటూ కౌంటర్లిస్తున్నారు.

గోడచాటునుంచి గిల్లడం దేనికి, డైరెక్ట్ గా గిల్లొచ్చుకదా అని అంటున్నారు అంబటి. నిజంగానే పవన్ సినిమాలో ఒక నిమిషం సీన్ పెట్టి అంబటిని గోడచాటుగా గిల్లారనే అనుకోవాలి. ఆ నిమిషం సీన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్యాంబాబు పాత్రపై మంత్రి రియాక్ట్ కావడం, వైసీపీ సోషల్ మీడియా ఆ వ్యాఖ్యల్ని హైలెట్ చేయడం.. ఒకరకంగా ఇది 'బ్రో'కి మంచి పబ్లిసిటీ అని చెప్పుకోవాలి. అసలు అంబటి పాత్రని సినిమాలో ఏం తిట్టారా అని ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

అంబటికి మద్దతుగా నాయకులెవరూ బయటకు రాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆయన చెప్పిన సినిమా టైటిళ్లు వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద రాంబాబు-శ్యాంబాబు ఎపిసోడ్ లో పవన్ సైలెంట్ గా ఉండటం, అంబటి అవసరానికి మించి రియాక్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  2 Aug 2023 12:03 PM IST
Next Story