కాకినాడలో తొడగొట్టిన పవన్ కల్యాణ్..
తాను అధికారంలోకి వచ్చిన రోజున క్రిమినల్ నాయకులందరికీ చెమడాలు వలిచేస్తానని, వీధి వీధి తిప్పుతూ తన్ని తన్ని తీసుకెళ్తానన్నారు. వైసీపీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తానన్నారు పవన్.
పిఠాపురం సభలో ఆవేశంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, కాకినాడ సభలో మరింత ఆవేశంగా ప్రసంగించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంగతి తేలుస్తానంటూ వారాహి వాహనంపై నిలబడి తొడగొట్టారు. ఆయన పతనం మొదలైందని, ఆయన సంగతి తేల్చే వరకు తాను నిద్రపోనన్నారు. ద్వారంపూడి క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదొయ్యకపోతే తన పేరు పవన్ కల్యాణే కాదని, తన పార్టీ జనసేనే కాదన్నారు.
టార్గెట్ ద్వారంపూడి..
కాకినాడ సభ మొత్తం ఎమ్మెల్యే ద్వారంపూడిని టార్గెట్ చేసేందుకే కేటాయించారు పవన్ కల్యాణ్. ద్వారంపూడి, ఆయన అనుచరులైన గూండాలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. తనను బండబూతులు తిట్టారని, అయినా సంయమనంతో ఉన్నానని, ఇకపై తానేంటో చూపిస్తానన్నారు పవన్. ఎమ్మెల్యే ద్వారంపూడికి భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ ఇస్తానన్నారు. ఆయనకు ఒళ్లు తిమ్మిరెక్కిందని, నోటిదూల ఎక్కువైందన్నారు పవన్. డెకాయిట్ ద్వారంపూడి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ద్వారంపూడి వంటి రౌడీ నాయకుల అరాచకాలు ఎక్కువైతే తనలాంటి దేశభక్తులు ఎదురు తిరుగుతారన్నారు పవన్.
హార్డ్ కోర్ క్రిమినల్స్ మన పాలకులు..
సీఎం జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసి గుండెపోటు అని సీన్ క్రియేట్ చేశారని, అంతా హార్డ్ కోర్ క్రిమినల్స్ అని అన్నారు పవన్ కల్యాణ్. ఆయన కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన రోజున క్రిమినల్ నాయకులందరికీ చెమడాలు వలిచేస్తానని, వీధి వీధి తిప్పుతూ తన్ని తన్ని తీసుకెళ్తానన్నారు. వైసీపీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తానన్నారు పవన్. సీఎం జగన్ ని రోడ్డుపైకి తీసుకొస్తానన్నారు.
జనసైనికులకు క్లాస్..
సభకు వచ్చిన అభిమానులు, జనసైనికులకు కూడా క్లాస్ తీసుకున్నారు పవన్ కల్యాణ్. సభలకు రావడం కాదు, ఎన్నికల సమయంలో తనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో రౌడీలను ఎదుర్కోవడం ఈజీ అని, నిజ జీవితంలో ద్వారంపూడి లాంటి రౌడీలను ఎదుర్కోవడం కష్టం అని.. పోరాడే దమ్ము, ధైర్యం కావాలని అవి తనకున్నాయని, తనను అసెంబ్లీకి పంపించాలని చెప్పారు. అధికారం లేకపోయినా దశాబ్ద కాలంగా ప్రజలకోసం నిలబడి ఉన్నానని, అధికారం ఇచ్చి చూడండి అంతా మార్చేస్తానని చెప్పారు పవన్. సినిమా టికెట్ కోసం క్యూలైన్లో ఉంటారు, ఓటు వేసేందుకు మాత్రం ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.