వ్యక్తిగత విమర్శలు.. పవన్ గురివింద నీతి
సీఎం జగన్ సిద్ధం అంటుంటే, తాము యుద్ధం అంటున్నామని చెప్పారు పవన్ కల్యాణ్. ఓట్లు చీలకూడదనే కూటమి కట్టామని.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే.. ఎవరూ ఆపలేరని బీరాలు పలికారు.
"నా పెళ్లిళ్ల గురించి, నా పెళ్లాల గురించి మీకెందుకు.. మీరు కూడా చేసుకోండి నాలుగైదు పెళ్లిళ్లు" అంటూ.. గతంలో పవన్ కల్యాణ్ ఎంతగా ఇదైపోయారో అందరికీ తెలుసు. కుటుంబం గురించి ప్రస్తావిస్తే పవన్ కు అంత కోపం. పోనీ ఆయనేమైనా పత్తిత్తా అంటే కాదు. ఆయన మాత్రం ఇతర నాయకుల కుటుంబాల గురించి ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఎంత దారుణంగా అయినా మాట్లాడొచ్చు. తాజాగా మరోసారి సీఎం జగన్ పై వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కల్యాణ్. తల్లి, చెల్లి అంటూ జగన్ పై నోరు చేసుకున్నారు.
కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని, మనుషులను విడగొట్టే ఆయన విష సంస్కృతి చివరకు ఆయన కుటుంబంలోకి కూడా వెళ్లిపోయిందన్నారు పవన్ కల్యాణ్. సమాజాన్ని కలిపే వారినే జనం గుర్తు పెట్టుకుంటారని, కానీ జగన్ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కష్టపడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇస్తే.. జగన్ తన చెల్లికి వాటా ఇవ్వలేదన్నారు పవన్. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారని ఎద్దేవా చేశారు. మొత్తానికి జగన్ వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపాలనే ఉత్సాహాన్ని ఇలా తీర్చేసుకున్నారు పవన్. భీమవరంలో పోటీ చేయాలనుకుంటున్న ఆయన.. అక్కడ స్థానిక నాయకులతో మీటింగ్ తర్వాత సంబంధం లేకుండా సీఎం జగన్ ని విమర్శిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.
మాది యుద్ధం..
సీఎం జగన్ సిద్ధం అంటుంటే, తాము యుద్ధం అంటున్నామని చెప్పారు పవన్ కల్యాణ్. ఓట్లు చీలకూడదనే కూటమి కట్టామని.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే.. ఎవరూ ఆపలేరని బీరాలు పలికారు. ప్యాకేజీకి అమ్ముడుపోయారంటూ వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఓట్లు చీలకూడదనే తాను కూటమి కట్టానంటూ కవర్ చేసుకుంటున్నారు పవన్. ఆశావహుల రాజకీయ జీవితాలను బలితీసుకుని.. తన గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు జనసేనాని. ఈ వ్యూహ రచన ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.