జగన్ కు అంత సీన్ లేదు.. నా స్థాయి అది కాదు
తన దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా తనకు అపాయింట్ మెంట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు పవన్. జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం తనకు లేదన్నారు.
జగన్ తనకు శత్రువు కాదని, ఆయనకు అంత సీన్ లేదని అన్నారు పవన్ కల్యాణ్. తణుకులో బహిరంగ సభకు సిద్ధమవుతున్న పవన్, ముందుగా ఆ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నేరుగా ప్రధానిని కలసి మాట్లాడే స్థాయి తనదని చెప్పారు. తన దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా తనకు అపాయింట్ మెంట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఒకవేళ ప్రస్తావించాల్సి వస్తే ఏం చెప్పి ఉంటాననేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు పవన్.
తరిమేస్తాం..
ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపైనే తన పోరాటమని చెబుతున్న పవన్ కల్యాణ్, బ్రిటీష్ వాళ్లే పారిపోయినప్పుడు జగన్ ఎంత అని ప్రశ్నించారు. జనసేన వచ్చాక పెండింగ్ లో ఉన్న సుగాలి ప్రీతి లాంటి కేసుల సంగతి తేలుస్తామన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించడం జనసేన మొదటి ప్రాధాన్యత అన్నారు. 300 రూపాయలు లంచం తీసుకునే పోలీసు నేరం కంటే.. టీడీఎస్ బాండ్స్ పేరుతో 309 కోట్లు దోచేసిన రాజకీయనేతది పెద్ద తప్పు అన్నారు.
తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు సమావేశం.#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
— JanaSena Party (@JanaSenaParty) July 13, 2023
Watch Live: https://t.co/xa1jkkGIrl
చెప్పుల తిప్పలు..
మరోసారి చెప్పుల ప్రస్తావన తీసుకొచ్చారు పవన్. అన్నవరంలో చెప్పులు పోవని మనోహర్ చెబితే వేసుకొని గుడి వరకు వెళ్లానని, కానీ ఆ చెప్పులు మచిలీపట్నంలో కనిపించాయన్నారు. అత్తారింటికి దారేది సినిమాపైరసీ అయితే దాని మూలాలు మచిలీపట్నంలోనే తేలాయన్నారు. దానికి దీనికి లింక్ ఏంటి..? అని ప్రశ్నించారు. కడపలో సినిమా ప్రింట్ అయితే మచిలీపట్నంలో తేలిందని, అన్నవరంలో చెప్పులు మిస్ అయితే మచిలీపట్నంలో కనిపించాయని, ఇది యాదృచ్ఛికమా ఇంకేదైనా ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
జనసేనకు కులం లేదని, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా జనసేనలో ఉంటే వారంతా జనసేన నాయకులేనన్నారు పవన్. తమవైపు నిలబడేవారే జనసేన నాయకులని చెప్పారు. తన పోరాటం జగన్ పై కాదని, ఆయన ప్రర్తనపైనే అని అన్నారు. జనసేన నమ్మిన ఏడు సిద్ధాంతాలు చాలా బలమైనవని చెప్పిన పవన్, కొంతకాలం తర్వాత భారతదేశ రాజకీయాలు మొత్తం ఆ ఏడు సూత్రాల చుట్టూనే తిరుగుతాయన్నారు.