పొత్తు నచ్చనివాళ్లు వెళ్లిపోవచ్చు.. కేడర్‌కి తేల్చిచెప్పిన పవన్
తనను ప్రధాని మోడీ, చంద్రబాబు అర్థం చేసుకుంటున్నా.. తాను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోవడం లేదని పవన్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు తథ్యమని, ఈ నిర్ణయం నచ్చనివారు ఉంటే పార్టీని వదిలి వెళ్లిపోవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ కేడర్‌కి స్పష్టంచేశారు. కానీ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఏ స్థాయి నాయకులైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్‌గా తీసుకుంటానని చెప్పారు. టీడీపీని తగ్గించేలా జనసేన పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను ప్రధాని మోడీ, చంద్రబాబు అర్థం చేసుకుంటున్నా.. తాను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోవడం లేదని పవన్ చెప్పారు. మోడీ అంతటి వ్యక్తి తనను అర్థం చేసుకుంటుంటే.. ఇక్కడ ఉన్న కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. తాను మొండి వ్యక్తినని, రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ బతిమాలరని స్పష్టంచేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు లోకేష్ యువగళంలో పాల్గొనాలని ఈ సందర్భంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కేడర్‌కు తెలిపారు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ జనసేన శ్రేణులు కలిసి వెళ్లాలని స్పష్టం చేశారు.