Telugu Global
Andhra Pradesh

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తారా..? ఆ బాధ్యత జగన్ దే..

చర్చకోసం టీడీపీ సభ్యులు పట్టుబడితే.. వారిపై దాడి చేయడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తారా..? ఆ బాధ్యత జగన్ దే..
X

ఏపీ అసెంబ్లీలో జరిగిన దాడి ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గొడవలు చట్టసభల నుంచి త్వరలో వీధుల్లోకి వస్తాయని మండిపడ్డారు. చర్చకోసం టీడీపీ సభ్యులు పట్టుబడితే.. వారిపై దాడి చేయడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.

అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఎస్సీలపై దాడి చేసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలని, బీసీలపై దాడి చేయాలని చూసింది ఈ పార్టీ ఎమ్మెల్యేలని ఇలా ఎవరి వెర్షన్ వారు చెప్పుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే పవన్ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం దాడి జరిగింది టీడీపీ నేతలపైనే అని తేల్చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు పవన్. జీవో నెంబర్‌-1పై చర్చకు స్పీకర్‌ అనుమతించకపోవడం దారుణం అని చెప్పారు.


చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని సభ్యులు పరిరక్షించాలన్నారు పవన్ కల్యాణ్. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని చెప్పారు. చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తామని, పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలని, చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదని అన్నారు పవన్. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని చెప్పారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎంపై కూడా ఉంటుందన్నారు.

First Published:  20 March 2023 8:22 PM IST
Next Story