అప్పుడు ఇప్పటం, ఇప్పుడు కుప్పం.. చంద్రబాబుకి పవన్ వకాల్తా
చంద్రబాబు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి అని, ఆ విధిని పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు పవన్.
కందుకూరు ఘటన తర్వాత పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు, గుంటూరు ఘటన తర్వాత కనీసం చంద్రబాబుపై విమర్శలు చేయలేదంటూ ఇప్పటికే వైసీపీనుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఆ కౌంటర్లకు తగ్గట్టుగానే ఇప్పుడు పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబు కోసం వకాల్తా పుచ్చుకున్నారు. బాబుకి మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో వైసీపీనుంచి ఓ రేంజ్ లో మళ్లీ ట్రోలింగ్ మొదలవుతోంది.
సొంత నియోజకవర్గంలో తిరగనీయరా..?
ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్-1 తీసుకొచ్చిందని మండిపడ్డారు పవన్ కల్యాణ్. చంద్రబాబు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి అని, ఆ విధిని పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అసలీ ఉత్తర్వులు అధికార పార్టీ నేతలకు వర్తించవా అని అడిగారు. రాజమండ్రిలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి జగన్ చేసిన షో.. ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో, పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకొస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నించాలన్నారు.
ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు - ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా??
— Pawan Kalyan (@PawanKalyan) January 4, 2023
మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??
ఇప్పటం.. కుప్పం
చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో తన పర్యటన సందర్భంగా ప్రభుత్వం బహిరంగ పరచిందని విమర్శించారు పవన్ కల్యాణ్. వాహనంలో నుంచి కనిపించకూడదని, ప్రజలకు అభివాదం చేయకూడదని, హోటల్ నుంచి బయటకు రాకూడదని తనపై నిర్బంధాలు విధించారన్నారు. ఇప్పటం వెళ్లకుండా అటకాయించారని, ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి ఇప్పుడు జీవో ఇచ్చారని చెప్పారు పవన్. ఈ ఉత్తర్వులను బూచిగా చూపి చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానంటూ మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఓదార్పు యాత్ర పేరుతో జగన్ దశాబ్దం పాటు యాత్రలు చేయొచ్చు కానీ, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు జనంలో తిరగడానికి అనుమతించకపోతే ఎలా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు పవన్. జగన్ అధికారంలో లేనప్పడు ఒక రూలు, జగన్ అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా అని ట్వీట్ చేశారు.