పల్లకి మోయటానికే సిద్ధపడ్దారా?
పవన్ మరోసారి తెలుగుదేశం పార్టీ పల్లకి మోయటానికి సిద్ధపడినట్లు అర్ధమవుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు, పవన్ రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం దాదాపు ఖాయమైంది.
కొద్దిరోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు తానిక ఎవరి పల్లకీ మోయటానికి సిద్ధంగా లేనని ప్రకటించారు. కానీ తాజా డెవలప్మెంట్లు చూసిన తర్వాత పవన్ మరోసారి తెలుగుదేశం పార్టీ పల్లకి మోయటానికి సిద్ధపడినట్లు అర్ధమవుతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు, పవన్ రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవటం దాదాపు ఖాయమైపోయింది.
పొత్తు పెట్టుకున్నాక ఎంత ఎక్కువ సీట్లిచ్చినా మహా అయితే 45 అసెంబ్లీలకు మించి చంద్రబాబు ఇవ్వరన్నది వాస్తవం. తీసుకున్న 45 స్ధానాల్లో జనసేన ఎన్నిచోట్ల గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపుతుంది? పోటీచేసిన వారిలో ఎంతమంది గెలుస్తారు ? అన్నదే కీలకం. అలాగే పోటీ చేసిన 45 మందీ గెలవరన్నది వాస్తవం. ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే ఎంతమంది గెలుస్తారన్నది పక్కనపెడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు కదా. మహా అయితే మంత్రివర్గంలో కొన్ని శాఖలను జనసేన తీసుకోవచ్చంతే.
మంత్రులుగా సరిపెట్టుకోవాల్సిందే కానీ ముఖ్యమంత్రి అయితే పవన్ కాలేరు. మరి అప్పుడు చంద్రబాబు ఎక్కిన పల్లకీని పవన్ మోసినట్లే అర్ధంకదా. మరింతోటి దానికి పల్లకీ మోయటానికి తాను సిద్ధంగా లేననే గంభీరమైన ప్రకటనలు దేనికి? పవన్ రాజకీయంలోనే తప్పులున్నాయి. ఆ విషయాన్ని అంగీకరించటానికి జనసేనాని సిద్ధంగా లేరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానీయను, వైసీపీని గెలవనీయను అనే గోలే తప్ప తాను ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన, పట్టుదలే పవన్లో కనబడటంలేదు.
రాజకీయాల్లో తనకు పదవి రావాలని అనుకుంటే ఒక పద్దతి ఉంటుంది. ప్రత్యర్ధికి రానీయకూడదంటే మరో పద్దతి ఉంటుంది. తాను సీఎం పదవిలో కూర్చోవాలని పవన్ పట్టుదలగా ఉంటే చేయాల్సిన రాజకీయం ఇదికాదు. జగన్‌ను, చంద్రబాబుని ఇద్దరినీ మొదటి నుండి వ్యతిరేకిస్తు సమదూరం పాటించుంటే ఇప్పుడు కథే వేరే విధంగా ఉండేది. చంద్రబాబు పాలనను చూసేశారు, జగన్ పరిపాలన ఏమిటో జనాలకు అర్ధమైంది. కాబట్టి పవన్‌కు కూడా ఒక అవకాశం ఇద్దామని జనాలు అనుకునేవారేమో. అప్పుడు సీఎం అవ్వాలన్న పవన్ కల నెరవేరేది. కానీ అలాకాకుండా ఎంతసేపు జగన్‌ను వ్యతిరేకించటమే తన రాజకీయమని పవన్ అనుకోబట్టే చివరకు పల్లకీ బోయీగా మిగిలిపోతారేమో.