పాయే.. జనసేనకు విజయవాడ వెస్ట్ కూడా గోవిందా..!
జనసేనకు ప్రధాన బలమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం, తన బీసీ సామాజికవర్గం ఓట్లు, టీడీపీ ఓటు బ్యాంకు కలిస్తే ఈజీగా గెలుస్తానని పోతిన మహేష్ చాలా ధైర్యంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో `శిబి చక్రవర్తి` పవన్ కళ్యాణ్ పొత్తులో తమకు దక్కిన మరో స్థానాన్ని ధారాదత్తం చేయడానికి సిద్ధమైపోయారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ సీటును బీజేపీకి ఇచ్చేయడానికి కళ్యాణ్‌బాబు రెడీ అంటున్నారు. రాష్ట్ర రాజకీయ రాజధాని అయిన విజయవాడలో తమకు దక్కిన ఒకే ఒక్క స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చేయడమేంటని జనసైనికులు గొణుక్కుంటున్నారు. ఎందుకంటే.. ఆ మాట పైకి అంటే సలహాలివ్వద్దు.. నోరుమూసుకోమని అంటాడని వారికి భయం.
పోతిన మహేష్ ఆశలు పోయినట్లేనా?
విజయవాడ వెస్ట్‌లో గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పోతిన మహేష్‌కు 22,367 ఓట్లు వచ్చాయి. జనసేనకు ప్రధాన బలమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం, తన బీసీ సామాజికవర్గం ఓట్లు, టీడీపీ ఓటు బ్యాంకు కలిస్తే ఈజీగా గెలుస్తానని పోతిన మహేష్ చాలా ధైర్యంగా ఉన్నారు. పొత్తు కలిస్తే ఈ టికెట్ తనదేనన్న ఆశతో అయిదేళ్లుగా వైసీపీని, జగన్‌ను, అక్కడ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును నిత్యం విమర్శిస్తూ వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ సీటును టీడీపీ జనసేన కోసమే వదిలేసింది. కానీ, పవన్ దాన్ని బీజేపీకి కట్టబెట్టడానికి రెడీ అయ్యారు.
బీజేపీకి ఇస్తే మల్లాది విష్ణు వస్తారా?
ఈ సీటు బీజేపీకి ఇచ్చినా ఇక్కడ ఆ పార్టీకి పెద్ద పేరు పొడిచేసిన నాయకులెవరూ లేరు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి, రానున్న ఎన్నికలకు టికెట్ దక్కని మల్లాది విష్ణు పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన్ను బీజేపీలో చేర్చుకుని వెస్ట్ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.