జగన్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది.. పవన్ శాపనార్థాలు
ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉందని, ఆర్టీసీ బస్సులు కూడా రాని గ్రామంలో 120 అడుగుల మేర రోడ్లు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు పవన్.
కూల్చివేతల ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని శాపనార్థాలు పెట్టారు పవన్ కల్యాణ్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేసిన ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారని గ్రామస్తులపై వైసీపీ కక్షగట్టిందని, అందుకే ఇప్పుడు హడావిడిగా రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఓటు వేయనివారు తమకు శత్రువులన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
49.95 శాతం మంది ప్రజలకే పాలకులా..?
గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 49.95 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని, వారికి మాత్రమే వైసీపీ నేతలు పాలకుల లాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు పవన్. ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉందని, ఆర్టీసీ బస్సులు కూడా రాని గ్రామంలో 120 అడుగుల మేర రోడ్లు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు పవన్. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని, ఇంతలో అధికారులు అత్యుత్సాహంతో జేసీబీలు తీసుకొచ్చారని విమర్శించారు. పోలీసుల సాయంతో జేసీబీలతో దండయాత్రకు వచ్చారని అన్నారు. అక్కడ ఆందోళనకు దిగిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం అని అన్నారు. ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఇప్పటంకు పవన్..
ఇప్పటం గ్రామం కేంద్రంగా జనసేన రాజకీయ పోరాటం మొదలు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే అక్కడికి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పవన్ కల్యాణ్ ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటించబోతున్నారు. ఇటీవల వైసీపీ, జనసేన మధ్య మాటల తూటాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆమధ్య ప్రెస్ మీట్ లో చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన పవన్, ఇప్పటంలో ఇంకెలా స్పందిస్తారోననే ఆసక్తి అందరిలో ఉంది.