Telugu Global
Andhra Pradesh

చిత్తూరు ఘటన: మళ్లీ జగన్ ని టార్గెట్ చేసిన పవన్..

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన విషయంలో అనుమానాస్పద మృతి అంటూ కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు.

చిత్తూరు ఘటన: మళ్లీ జగన్ ని టార్గెట్ చేసిన పవన్..
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న పవన్ కల్యాణ్, కొన్నిరోజులు సినిమా షూటింగ్ లకు పరిమితం అయ్యారు. మళ్లీ వారాహితో ఆయన జనంలోకి రావాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో చిత్తూరు జిల్లా ఘటనపై ఆయన జగన్ ని టార్గెట్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.


చిత్తూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి విషయంలో ఇంతవరకూ నిందితుల్ని గుర్తించలేకపోయారు పోలీసులు. ఆ బాలికది హత్యేనంటున్నారు తల్లిదండ్రులు, అత్యాచారం కూడా జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీస్ విచారణలో వాస్తవాలింకా తేలలేదు. బాలికపై అత్యాచారం జరగలేదు, అది హత్యకాదు అంటున్నారు పోలీసులు. అసలు నిజమేంటో ఇంకా బయటకు రాలేదు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు పవన్ కల్యాణ్. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యంపై మాట్లాడితే హాహాకారాలు చేసిన మహిళా కమిషన్ ఇప్పుడు ఏం చేస్తోందో చెప్పాలన్నారు. భారీగా నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. హత్యకు గురైన బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

జగన్ స్పందించరేం..?

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన విషయంలో అనుమానాస్పద మృతి అంటూ కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలిక సామూహిక అత్యాచార ఘటన కూడా తనను కలచి వేసిందన్నారు పవన్. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులను పాలకపక్షం కట్టేస్తోందని విమర్శించారు. దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్లు.. మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.

First Published:  28 Sept 2023 11:20 AM IST
Next Story