Telugu Global
Andhra Pradesh

అరెస్ట్ చేస్తారా..? చిత్రవధ చేస్తారా..?? నేను రెడీ

"నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవధ చేసుకోండి, నేను సిద్ధమే. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నా. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి, నేను రెడీ." అంటూ ప్రభుత్వానికే సవాల్ విసిరారు పవన్.

అరెస్ట్ చేస్తారా..? చిత్రవధ చేస్తారా..?? నేను రెడీ
X

ఏపీ ప్రభుత్వం తనపై కేసు పెట్టేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేయడంపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను అన్నిటికీ తెగించే వాలంటీర్లపై ఆ వ్యాఖ్యలు చేశానని, ఇప్పటికీ వాటికే కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టారాయన. "నన్ను అరెస్ట్ చేసుకోండి, చిత్రవధ చేసుకోండి, నేను సిద్ధమే. నేను ఏపీ అభివృద్ధికి కమిట్ మెంటుతో ఉన్నా. నన్ను ప్రాసిక్యూషన్ చేయాలనుకుంటే చేయండి, నేను రెడీ." అంటూ ప్రభుత్వానికే సవాల్ విసిరారు పవన్.

వైసీపీ నేత పంచకర్ల రమేష్ బాబు.. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్‌, ప్రభుత్వ ఆదేశాలపై స్పందించారు. తనను ప్రాసిక్యూట్ చేయాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా..? అని ప్రశ్నించారు పవన్‌. పొరపాటున మానభంగాలు జరుగుతున్నాయి అని చెప్పే మంత్రులు కూడా ఏపీలో ఉన్నారని, వారిని ప్రాసిక్యూట్ చేయరా..? అని నిలదీశారు. రెడ్ క్రాస్ వంటి సంస్థకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా సేవలు అందించే వారిని వాలంటీర్లు అంటారని.. 5వేల రూపాయల జీతం తీసుకునేవారిని వాలంటీర్లు అనకూడదని చెప్పారు.


అందరి లెక్కలు తేలుస్తా..

ఏపీలో వాలంటీర్ల ద్వారా డేటా దొంగతనం జరుగుతోందని మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. దీనిపై తాను కేంద్రానికి ఫిర్యాదు చేశానన్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తాను సమావేశమై ఈ విషయాలన్నీ వివరించానన్నారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లతో నిఘా పెడుతోందని, ఏపీ ప్రజల డేటా అంతా FOA అనే కంపెనీకి వెళ్తోందని అన్నారు పవన్. కేంద్రం దీనిపై విచారణ చేపడుతుందని, అప్పుడు వాలంటీర్లు ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. అసలు FOA కంపెనీ ఎవరిదని ప్రశ్నించారు పవన్.

గతంలోనూ అవినీతి ఉండేదని, కానీ జగన్ హయాంలో కొండలు దోచేసే అవినీతి జరుగుతోందని ఆరోపించారు పవన్. జనసేన యువతకు, వాలంటీర్లకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వం మారాలని, జనం బాగుండాలంటే జగన్ పోవాలని పిలుపునిచ్చారు. తనను ప్రాసిక్యూట్ చేయాలంటే ముందు జగన్ మైనింగ్ దోపిడీ సంగతి తేల్చాలన్నారు. తనకోసం పోలీసుల్ని పంపించినా భయపడబోనన్నారు పవన్.

First Published:  20 July 2023 10:12 PM IST
Next Story