తిరుపతిపై పవన్ దండయాత్ర.. భూమన ఘాటు విమర్శలు
ఎస్పీని కలిసేందుకు పవన్ తోపాటు మరో ఏడుగురికి అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో పవన్ ర్యాలీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరంపై ఇది దండయాత్ర లాగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యే భూమన.
పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో ఆయన వాహనం కదలకుండా అభిమానులు చుట్టుముట్టారు. అతి కష్టమ్మీద పవన్ అభివాదం చేసుకుంటూ వాహనంలో ముందుకు కదిలారు. అయితే పవన్ తిరుపతికి వచ్చింది ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కాదని, దండయాత్రలాగా ఆయన ఆధ్యాత్మిక నగరానికి వచ్చారని మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇలా కూడా ఫిర్యాదు చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినతిపత్రం పేరుతో తిరుపతికి పవన్ దండయాత్రకు వచ్చినట్టు ఉందని అన్నారు భూమన. ప్రజాస్వామ్యబద్దంగా పాలన చేస్తున్న అధికార పార్టీపై నిత్యం పవన్ నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. తనకు ఓటు వేస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజలకు చెప్పకుండా.. నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలతో ఆయన కాలంగడుపుతున్నారని ఎద్దేవా చేశారు. నేను అనేది తప్ప, మేము అనే పదం పవన్ నోటి వెంట రావట్లేదని పేర్కొన్నారు భూమన.
జనసేన నాయకుడిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ కల్యాణ్ ఈరోజు తిరుపతి వచ్చారు. గన్నవరం నుంచి రేణిగుంటకు విమానంలో వచ్చిన ఆయన, అక్కడినుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. ఎస్పీని కలిసేందుకు పవన్ తోపాటు మరో ఏడుగురికి అనుమతి ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో పవన్ ర్యాలీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరంపై ఇది దండయాత్ర లాగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్యే భూమన.