కలసి పోరాడదాం.. లోకేష్ కి పవన్ ఫోన్
చంద్రబాబుని జైలుకి తరలించిన తర్వాత నారా లోకేష్ కి పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలంటూ, లోకేష్ కి ఫోన్ లో పవన్ సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత టీడీపీ శ్రేణుల రియాక్షన్ కంటే జనసేనాని పవన్ కల్యాణ్ ఎమోషన్ బాగా పండింది. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారాయన. జగన్ జైలుకు వెళ్లారు కాబట్టి, అందర్నీ జైలుకు పంపించాలనే ఆలోచన ఆయనకు ఉందని చెప్పారు. జగన్ ఒక సైకో అని, క్రిమినల్ ఆలోచన కలిగిన వ్యక్తి అని మండిపడ్డారు. మర్డర్లు చేసేవారికి అండగా నిలిచే స్వభావం ఉన్న జగన్, రాష్ట్రంలోని సహజ సంపద మొత్తాన్ని కొల్లగొడుతున్నారన్నారు. జగన్ ని అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్.
లోకేష్ కి మద్దతు..
చంద్రబాబుని జైలుకి తరలించిన తర్వాత నారా లోకేష్ కి పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలంటూ, లోకేష్ కి ఫోన్ లో పవన్ సంఘీభావం తెలిపారు. జగన్ నియంత పాలనపై కలసి పోరాటం చేద్దామని ఫోన్ లో చెప్పారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం జగన్ కి సంతోషంగా ఉండి ఉండొచ్చని, నియంతలా సాగిస్తున్న ఆయన అరాచకాలపై అంతా కలిసి పోరాడదామని పవన్ పేర్కొన్నారు.
బంద్ కి మద్దతు..
మరోవైపు ఈరోజు టీడీపీ బంద్ కు జనసేన మద్దతు ఇచ్చింది. జనసేన శ్రేణులు శాంతియుతంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు ముసుగులో గుద్దులాటలా ఉన్న టీడీపీ-జనసేన పొత్తుల వ్యవహారం కూడా చంద్రబాబు అరెస్ట్ తో ఓ కొలిక్కి వచ్చినట్టయింది. పొత్తులపై కూడా దాదాపుగా పవన్ తేల్చేశారు. టీడీపీతోనే తమ ప్రయాణం అన్నారు. బీజేపీకి ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ వైఖరి మాత్రం స్పష్టమైంది.