షర్మిల కారణంగా పవన్ కు షాక్ తప్పదా..?
ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ కూడా కాస్త యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎంత యాక్టివ్ అయితే టీడీపీ, జనసేనకు అంతనష్టం.
రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. వైసీపీని ఓడిస్తామని పవన్ ఛాలెంజ్‌లు విసురుతున్నారు. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మిత్రపక్షం బీజేపీని కూడా తమతో కలవమని పవన్ అడుగుతున్నారు. బీజేపీ రాకపోయినా పవన్ పట్టించుకోరు. ఎందుకంటే.. బీజేపీకి ఓట్లేమీ లేవు కాబట్టి. ఇక కాంగ్రెస్, వామపక్షాలదీ బీజేపీ పరిస్థితే కాబట్టి వాటిగురించి పవన్, చంద్రబాబు పట్టించుకోలేదు.
అయితే సడన్ గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటంతో కాస్త ఊపొచ్చింది. వైసీపీలో టికెట్లు దక్కని అసంతృప్తుల్లో కొందరు కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. అలాంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ టికెట్లిస్తుంది కాబట్టి, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. మామూలుగా అయితే జనసేన పార్టీ పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగ ఉండేది. అయితే టీడీపీతో జతకట్టడంతో కొన్ని సీట్లలో జనసేన గెలుస్తుంది అనే ప్రచారం మొదలైంది.
ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ కూడా కాస్త యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎంత యాక్టివ్ అయితే టీడీపీ, జనసేనకు అంతనష్టం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ ఆలోచన నీరుగారిపోతుంది. ఇంతకుముందు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయనే భావనలో చంద్రబాబు, పవన్ ఉండేవారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెచ్చుకోవటం కోసం టీడీపీ, జనసేనతో కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది.
టీడీపీ+జనసేన ఒక కూటమిగా, కాంగ్రెస్+వామపక్షాలు ఒకటిగా పోటీచేసే అవకాశాలున్నాయి. టీడీపీ-జనసేనతో వామపక్షాలు కలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పుడైనా ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు. ప్రభుత్వ వ్యతిరేక పార్టీల్లో ఎన్ని చీలికలు వస్తే వైసీపీకి అంత లాభమని తెలిసిందే. ప్రభుత్వ మద్దతు ఓట్లన్నీ వైసీపీకే పడతాయి. వ్యతిరేక ఓట్లలోనే చీలికొచ్చేస్తుంది. కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీల్చుకుంటే పవన్, చంద్రబాబుకు అంత మైనస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి పవన్ కు షర్మిల షాక్ ఇవ్వబోతున్నారని అర్ధమవుతోంది. అయితే అది ఏ రేంజిలో ఉంటుందన్నదే సస్పెన్స్.