Telugu Global
Andhra Pradesh

బాలయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గెటప్ లోనే బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో పవన్ కొంతసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాకతో వీరసింహారెడ్డి సెట్స్ లో సందడి నెలకొంది.

బాలయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ
X

కొంతమంది ఒకచోట కలిసి మాట్లాడడం అందరిలో ఆశ్చర్యం నింపుతుంది. అలాంటి వ్యక్తులే నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మామూలుగా సినిమాల పరంగా ఎప్పుడూ మెగా వర్సెస్ నందమూరి అన్నట్లు వార్ జరుగుతూ ఉంటుంది. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య మొదటి నుంచి పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే రకంగానే వ్యవహారాలు సాగుతున్నాయి. ఇక మెగా, నందమూరి హీరోలు కూడా ఒకరినొకరు కలుసుకోవడం తక్కువే. సమకాలీన హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ చాలా అరుదుగా మాత్రమే కొన్ని సందర్భాల్లో కలిశారు. ఇక మరో మెగాహీరో అయిన పవన్ కళ్యాణ్ కూడా అంతే. బాలకృష్ణతో ఒక వేదికను పంచుకున్న సందర్భాలు చాలా చాలా అరుదు. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి కలిశారంటే ఆశ్చర్యం కలగక మానదు.

పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన తొలి రోజుల్లో సుస్వాగతం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బాలకృష్ణ వచ్చారు. ఆ సందర్భంగా ఆయన పవన్ మూవీకి క్లాప్ కొట్టారు. ఆ తర్వాత మరే సందర్భంలోనూ ఒకరి సినిమా వేడుకల్లో మరొకరు కనిపించలేదు. ఇన్నేళ్ల తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్ కి ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్లారు. నటీనటులు తమ సెట్స్ పక్కన మరో సినిమా షూటింగ్ ఏదైనా ఉంటే వెళ్లి కలవడం మామూలే. కానీ, పవన్ కళ్యాణ్ హీరోగా నటించే సినిమా, బాలకృష్ణ నటించే సినిమాల షూటింగ్స్ పక్కపక్కన జరగడం లేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గెటప్ లోనే బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు.

ఈ సందర్భంగా బాలకృష్ణతో పవన్ కొంతసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాకతో వీరసింహారెడ్డి సెట్స్ లో సందడి నెలకొంది. వీర సింహారెడ్డి చిత్ర బృందం మొత్తం పవన్ కళ్యాణ్ తో కలిసి ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించింది. బాలకృష్ణ, పవన్ కూడా పక్కపక్కనే నిలబడి ఫొటోలు దిగారు. బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇటీవల పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించగా.. ఆయన ఒకే చెప్పారని వార్తలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని ఒక రోజు షోకు హాజరవుతానని మాట కూడా ఇచ్చాడని సమాచారం. ఇంతలోనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణను కలిశాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణను ఎందుకోసం కలిశాడన్న విషయమై సమాచారం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ -బాలకృష్ణ ఒకే ఫొటో ఫ్రేమ్ లో కనిపించడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

First Published:  23 Dec 2022 2:57 PM
Next Story