విశాఖలో పవన్ కళ్యాణ్... ఆశావహులతో వరుస భేటీలు
విశాఖ సిటీలోని నియోజకవర్గాలతోపాటు భీమిలి, యలమంచిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలపై జనసేన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి విశాఖ వెళ్లారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడే ఉండి ఆ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో జనసేన తరఫున పోటీకి ఆశావహులు ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో అంచనాకు రానున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తర్వాత పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది విశాఖపైనే. అందుకే ఇక్కడ ఎన్ని సీట్లు అడగాలి, వాటిలో నిలబడటానికి ఎంత మంది రెడీగా ఉన్నారు లెక్కలన్నీ చూసుకోవడానికే జనసేనాని సడన్‌గా విశాఖ టూర్ పెట్టుకున్నారు.
కొణతాలతో భేటీ
ఇటీవలే జనసేనలో చేరిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి పవన్ ఆయనతో ఏకాంతంగా చర్చించారు. ప్రధానంగా విశాఖ నగరం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న అవకాశాలపై వారి మధ్య చర్చ జరిగిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి..
విశాఖ సిటీలోని నియోజకవర్గాలతోపాటు భీమిలి, యలమంచిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలపై జనసేన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొణతాలను కలిసిన తర్వాత నోవోటెల్ హోటల్‌కు చేరిన పవన్ రాబోయే రెండు, మూడు రోజుల్లో ఈ నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు ఉంటాయని జనసేన వర్గాల కథనం. పొత్తులో మనం టికెట్ తెచ్చుకోగలిగితే గెలవగలిగే నియోజకవర్గాలు ఏంటి? వాటిలో మన బలాబలాలు, టీడీపీ ఎంత వరకు కలిసివస్తుందనేది తేల్చుకోవడానికే పవన్ విశాఖ టూర్‌కు వచ్చినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.