Telugu Global
Andhra Pradesh

ప్రతి కులంలోనూ కొంతమంది చెంచాలున్నారు -పవన్

తూర్పు కాపులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, ఎప్పుడూ మరొకరిని ప్రాధేయపడే పరిస్థితిలో ఉండకూడదన్నారు పవన్ కల్యాణ్. కులానికో పదవి, 75 వేల రూపాయల జీతం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం నోరు మూయించేస్తోందని చెప్పారు.

ప్రతి కులంలోనూ కొంతమంది చెంచాలున్నారు -పవన్
X

ప్రతి కులంలోనూ కొంతమంది చెంచాలున్నారని, వారు కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగి ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్ ని ఏనాడో శాసించేవారని, ఇకనైనా ఐక్యంగా ఉండాలని కోరారు. రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, ఎప్పుడూ మరొకరిని ప్రాధేయపడే పరిస్థితిలో ఉండకూడదన్నారు. కులానికో పదవి, 75 వేల రూపాయల జీతం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం నోరు మూయించేస్తుందని చెప్పారు పవన్.

నేను తేనెపూసిన కత్తిని కాదు..

వైసీపీ వాళ్లలాగా తాను తేనె పూసిన కత్తిని కాదన్నారు పవన్ కల్యాణ్. తియ్యని అబద్ధాలు చెప్పి మోసం చేయబోనని చెప్పారు. ఒక్క సినిమాను ఆపడానికి వాళ్లు యంత్రాంగాన్ని అంతా ఉపయోగిస్తున్నారని చెప్పారు. అమరావతిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్, వారిలో రాజకీయ ఐక్యత ఉండాలని సూచించారు. తూర్పు కాపు రిజర్వేషన్ల సర్టిఫికెట్లు పొందే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు పవన్ కి వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు.

టీడీపీయే మేలు..

తూర్పు కాపుల జనాభా లెక్కను ప్రభుత్వం తగ్గించి చూపుతోందంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్. టీడీపీ ప్రభుత్వం 26 లక్షల మందిని తూర్పు కాపులుగా గుర్తిస్తే, వైసీపీ కేవలం 16 లక్షలే అంటోందన్నారు. కావాలనే తూర్పు కాపుల జనాభాను తక్కువగా చూపుతున్నారని చెప్పారు పవన్.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని తూర్పు కాపులకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. వారి సమస్యల పరిష్కారానికి జనసేన అండగా నిలబడుతుందని చెప్పారు. అలా నమ్మితే జనసేన పార్టీకి ఓటు వేయాలన్నారు. ప్రస్తుతం ఏపీలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక మంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఒక్కరు కూడా ఆ సామాజిక వర్గం సమస్యలు పరిష్కరించే స్థితిలో లేరన్నారు. మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కూడా వారి సమస్యలను అధినాయకత్వానికి చెబుతున్నారే కానీ పరిష్కరించడంలేదన్నారు.

ఆయన సీఎం, ఈయన డీఫ్యాక్టో సీఎం..

ఉత్తరాంధ్ర మినహా మిగిలిన జిల్లాల్లోని తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఎందుకివ్వడం లేదో సీఎం జగన్ కి తెలియదన్నారు. ఆ విషయాన్ని డీఫ్యాక్టో సీఎం సజ్జల కూడా చెప్పడంలేదన్నారు. ఈ నిబంధన కేవలం తూర్పు కాపులకే ఎందుకు అమలు చేస్తున్నారో జగన్ కి తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పారు పవన్.

First Published:  27 Nov 2022 10:30 AM IST
Next Story