సోషల్ మీడియాతో జాగ్రత్త.. నేతలకు పవన్ హెచ్చరిక
తన సినిమాలు, తన కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించవద్దని జనసేన నేతలకు సూచించారు పవన్ కల్యాణ్.
సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని జనసేన నేతలను హెచ్చరించారు పవన్ కల్యాణ్. సోషల్ మీడియాకు అనవసర ఇంటర్వ్యూలు ఇవ్వొద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమో కాదో నిర్థారించుకోకుండా అనవసరంగా స్పందించొద్దని చెప్పారు. ఆ విషయాలను ఇతరులకు, పార్టీ ఆఫీస్ కి షేర్ చేసి హడావిడి చేయొద్దన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా షేర్ చేయొద్దన్నారు. పార్టీ కోసమే మాట్లాడాలని సూచించారు పవన్.
చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి...
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2023
వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు
• ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత
• ప్రజోపయోగ అంశాలపై బలంగా మాట్లాడండి
• అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు… pic.twitter.com/6JIA8xPhFL
నా కుటుంబాన్ని విమర్శించినా..!
తన సినిమాలు, తన కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దని జనసేన నేతలకు సూచించారు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. మీడియా చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార ప్రతినిధులకు గురుతర బాధ్యత ఉందని గుర్తు చేశారు పవన్.
టీవీ చర్చల్లో పాల్గొనేవారు నిత్య విద్యార్థులుగా ఉండాలని, నిత్యం అధ్యయనం చేస్తూ విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు పవన్ కల్యాణ్. టీవీ చర్చల్లో వ్యక్తిగత దూషణలు వద్దన్నారు. కుల మతాల ప్రస్తావన వచ్చినప్పుడు రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడాలని సలహా ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులని దూషించ వద్దని, ఎప్పుడు ఎవర్ని కలవాల్సి రావాల్సిన సందర్భం వస్తుందో చెప్పలేమన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి వ్యతిరేకం కానని చెప్పుకొచ్చారు పవన్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని జనసేన నాయకులకు హితబోధ చేశారు పవన్.
♦