ఇద్దరిలో అనకొండ ఎవరు?
జగన్ అధికారంలోకి రాగానే చిన్నాన్న వివేకాను పొట్టనపెట్టుకున్నాడు, అనకొండలా మింగేశాడని పవన్ ఆరోపించారు.ఇక్కడే జగన్ అంటే పవన్‌లో ఎంతటి ద్వేషమో అర్థమవుతోంది. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబునాయుడు. మార్చిలో వివేకా హత్య జరిగితే ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి.
జగన్మోహన్ రెడ్డి అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో కసి, ద్వేషం పెరిగిపోతోంది. రాజోలు సభలో జగన్‌ను అనకొండతో పోల్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే జనాలందరు కలిసి మనవాడని జగన్‌కు ఓట్లేసి అధికారం అప్పగిస్తే సొంత చిన్నాన్న వివేకానందరెడ్డినే అనకొండలా మింగేశాడన్నారు. ఇక్కడే జగన్ అంటే పవన్‌లో ఎంతటి ద్వేషం పేరుకుపోయిందో అర్థమవుతోంది. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబునాయుడు. మార్చిలో వివేకా హత్య జరిగితే ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి.
మే నెలలో ఫలితాలు వస్తే జూన్ నెలలో జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి పవనేమో జగన్ అధికారంలోకి రాగానే చిన్నాన్న వివేకాను పొట్టనపెట్టుకున్నాడు, అనకొండలా మింగేశాడని చెప్పటమేంటో అర్థంకావటంలేదు. పవన్ లెక్క ప్రకారం వివేకాను పొట్టన పెట్టుకోవటమే అనకొండ లక్షణమైతే ఆ పని చేసింది చంద్రబాబే కానీ జగన్ కాదు. ఇంత ముఖ్యమైన విషయాన్ని కూడా పవన్ తన ఇష్టంవచ్చినట్లు మార్చేస్తున్నారు.
ఇక్కడ పవన్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఏమిటంటే జగన్‌పై బురదచల్లటమే. ఆ చల్లేదేదో నేరుగా చల్లేయచ్చు కదా. సంబంధం లేని విషయాల మీద మాట్లాడి, అనవసరమైన విషయాల్లోకి జగన్‌ను లాగి బురదచల్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక సందర్భంలో కర్నూలులో సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే కూడా జగన్ ప్రభుత్వం చలించలేదన్నారు. సుగాలి ప్రీతి హత్య జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ జరిపించమంటే చంద్రబాబు పట్టించుకోలేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్ ప్రకారమే కేసును సీబీఐకి అప్పగిస్తూ లేఖ రాశారు. అప్పటికే ఘటన జరిగి సుమారు రెండేళ్ళయిపోయింది. ఇందులో జగన్ తప్పేముంది? చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలను కూడా వైసీపీ ఖాతాలో వేసేసి జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత గుళ్ళను కూల్చేశారట. ఫ్లైఓవర్ వేయటానికి అడ్డంగా ఉందని విశాఖ జిల్లాలో ఒక గుడిని తొలగించారంతే. మరి చంద్రబాబు హయాంలో విజయవాడలోనే ఏకంగా 36 గుళ్ళని కూల్చేశారు. మళ్ళీ కట్టలేదు కూడా. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఇక్కడే తెలిసిపోతోంది జగన్ అంటే పవన్‌లో ఎంతటి ద్వేషం పేరుకుపోయిందో.