ఇక జనసేన అంబులెన్స్ సేవలు..
రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లు ఏపీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. స్థానికంగా పట్టున్న నేతలు అంబులెన్స్ నిర్వహణ సహా ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటికి తోడు ఎక్కడికక్కడ స్థానిక నాయకులు తమ పేరుతోనో లేదా ఏదైనా ట్రస్ట్ పేరుతోనో అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుంటారు. ఇటీవల హిందూపురంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పేరుతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మంగళగిరిలో ఇప్పటికే సొంత నిధులతో రోడ్లు వేయిస్తూ, తోపుడు బండ్లు పంచుతున్న నారా లోకేష్ కూడా అంబులెన్స్ సేవలు మొదలుపెట్టారు. తాజాగా జనసేన నాయకులు కూడా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకుడు రూ.30 లక్షల ఖర్చుతో 3 ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. జనసేన అంబులెన్స్‌లను పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
రాజానగరంలో గతంలో జనసేనకు 12 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి అక్కడ మరింతగా దృష్టి పెట్టేందుకు ఇప్పటి నుంచే నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల జనసేన అంబులెన్స్‌లు తీసుకురావాలని సూచించారట పవన్ కల్యాణ్. స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో నాయకులపై నమ్మకం పెరుగుతుందని, అధికారం లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్నారనే పేరొస్తుందని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో మరికొన్ని..
రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రైవేట్ అంబులెన్స్‌లు ఏపీలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. స్థానికంగా పట్టున్న నేతలు అంబులెన్స్ నిర్వహణ సహా ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి నాయకులు ఎక్కువగా అంబులెన్స్‌ల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో 108లకు ఇప్పుడు టీడీపీ, జనసేన అంబులెన్స్ లు తోడవుతున్నాయి.