విశాఖ గర్జనకు పోటీగా జనవాణి.. ఉత్తరాంధ్రకు జనసేనాని..
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో 3రోజులపాటు పర్యటించబోతున్నారు. 15, 16, 17 తేదీల్లో ఉత్తరాంధ్ర జనసేన నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఈ క్రమంలో 16వ తేదీన ఆయన జనవాణి నిర్వహిస్తారు.
ఈనెల 15న మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదే స్ఫూర్తితో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మూడు రాజధానులకు మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ "ఎందుకీ గర్జనలు..?" అనే ట్వీట్లు కూడా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ అక్కడితో ఆగలేదు. ఆ మరుసటి రోజే విశాఖలో జనవాణి పెట్టాలని డిసైడ్ అయ్యారు. విశాఖలో ఉన్న సమస్యలు ఇవీ అంటూ హైలెట్ చేయబోతున్నారు.
3 రోజుల పర్యటన..
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో 3రోజులపాటు పర్యటించబోతున్నారు. 15, 16, 17 తేదీల్లో ఉత్తరాంధ్ర జనసేన నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఈ క్రమంలో 16వ తేదీన ఆయన జనవాణి నిర్వహిస్తారు. స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఆయన జనవాణి నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు సరిగ్గా విశాఖ గర్జన పేరుతో అక్కడ హడావిడి జరుగుతున్న సందర్భంలో పవన్ కూడా అదే ప్రాంతాన్ని జనవాణికి ఎంపిక చేసుకోవడం విశేషం.
విశాఖ కేంద్రంగా విమర్శలు..
విశాఖ రాజధాని కావాలంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు, దానికోసం రాజీనామాలు సైతం చేస్తున్నారు. అయితే మూడేళ్లు అధికారంలో ఉన్నా విశాఖను ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రాజెక్ట లు రాలేదని, రుషికొండను తవ్వేశారని, ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోలేకపోయారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఇందులో భాగంగానే విశాఖ కేంద్రంగా జనసేనాని జనవాణి పేరుతో వైసీపీపై ప్రశ్నలు ఎక్కుపెట్టబోతున్నారు. జనవాణిలో తన వద్దకు వచ్చే సమస్యలే కాకుండా.. విశాఖ కేంద్రంగా ఆయన రాజకీయ విమర్శలు చేసే అవకాశముంది. గర్జన మరుసటి రోజే ఆయన ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఆసక్తిగా మారింది.