అబద్ధాలు చెప్పటానికేనా వారాహి యాత్ర?
ఉత్తరాంధ్ర వారాహి యాత్ర చేస్తున్న పవన్ పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. తాను చెప్పిందాన్ని జనాలు నిజమని నమ్మాలని, నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారు.
ఒక అబద్ధం చెప్పి దాన్ని నిజమనుకోమని జనాలకు చెప్పటానికి ఇంతకాలం చంద్రబాబు, ఎల్లో మీడియా నానా అవస్థలు పడేవారు. వీళ్ళకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. ఉత్తరాంధ్ర వారాహి యాత్ర చేస్తున్న పవన్ పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. తాను చెప్పిందాన్ని జనాలు నిజమని నమ్మాలని, నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణమూర్తి రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఎందుకు రాజీనామా చేయాలంటే ఎంపీ అసమర్థుడట, మూర్తిని నమ్మి గెలిపిస్తే విశాఖను వదలి పారిపోవాలని అనుకుంటున్నారట. విశాఖను వదిలి పారిపోయే వ్యక్తికి ఎంపీ పదవి ఎందుకని రాజీనామా డిమాండ్ చేశారు. అసలు ఎంపీ విశాఖను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు పవన్‌కు ఎవరు చెప్పారు? ఎంపీ ఎప్పుడూ ఈ మాట చెప్పలేదే. విశాఖలోని తన బిజినెస్‌లను మాత్రమే హైదరాబాద్‌కు మార్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అదికూడా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కారణంగానే అని స్పష్టంగా చెప్పారు.
అధికార పార్టీ ఎంపీ అయిన కారణంగా తన వ్యాపారాల్లో ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా వెంటనే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రభుత్వానికి ముడేసి దుష్ప్రచారం చేస్తున్నట్లు ఎంపీ మండిపడ్డారు. తన వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు కలగవద్దనే తాను హైదరాబాద్ బిజినెస్ పైన ఎక్కువ దృష్టిపెడదామని అనుకుంటున్నట్లు ఎంపీ స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందే మూర్తి పెద్ద బిల్డర్. ఏపీతో పాటు హైదరాబాద్‌లో చాలా ప్రాజెక్టులున్నాయి.
హైదరాబాద్‌కు తన బిజినెస్‌లను మారుస్తానని మూర్తి చెబితే విశాఖ వదిలి వెళ్ళిపోతానన్నావు కాబట్టి ఎంపీగా రాజీనామా చేయమని పవన్ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ఇక వరలక్ష్మి అనే మహిళను వలంటీర్ హత్య చేశాడని పదేపదే పవన్ చెబుతున్నది కూడా అబద్ధమే. విధులకు సరిగా హాజరుకావటంలేదని సదరు వలంటీర్‌ను అధికారులు తీసేశారు. తర్వాత అతను వరలక్ష్మి నడుపుతున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో చేరాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో వరలక్ష్మిని అతను చంపేశాడు. మహిళను వలంటీరే చంపాడని పవన్ కావాలని పదేపదే ఆరోపిస్తున్నారు. వలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్‌కు తేడా లేదని ఆరోపిస్తూ తన అక్కసంతా తీర్చుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత అబద్ధాలు చెప్పటానికే పవన్ వారాహి యాత్ర చేస్తున్నట్లుంది.