జనసేనాని భయపడ్డారు.. భీమవరంలో అంజిబాబుకు టికెట్‌పై కసరత్తు!
భీమవరంలో సేఫ్ కాదని, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై ఏమాత్రం వ్యతిరేకత లేదని వచ్చిన సర్వే రిపోర్టులు జనసేనానిని కంగారు పెట్టాయట!
గత ఎన్నికల్లో మా అన్న భీమవరంలో ఓడిపోయాడు.. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. మళ్లీ భీమవరం నుంచే నిలబతారు.. ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాం.. ఇవీ జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానుల మాటలు. కానీ అభిమానుల మాట చెల్లించడంలో ఎప్పుడూ నిలబడని పవన్ మరోసారి వారికి దెబ్బ కొట్టబోతున్నారు. భీమవరం వదిలి మరో నియోజకవర్గం చూసుకోబోతున్నారు.
పులవర్తి అభ్యర్థిత్వంపై సీరియస్‌గా కసరత్తు
భీమవరంలో సేఫ్ కాదని, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై ఏమాత్రం వ్యతిరేకత లేదని వచ్చిన సర్వే రిపోర్టులు జనసేనానిని కంగారు పెట్టాయట! అందుకే ఈసారి కాపుల ఓట్లు ఎక్కువగా ఉండి, విజయావకాశాలు కనిపిస్తున్న పిఠాపురం లాంటి స్థానానికి తరలిపోవాలని ఆయన డిసైడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు)ను జనసేనలో చేర్చుకుని టికెటిచ్చే అంశంపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు.
ఎవరీ అంజిబాబు?
2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి రెండుసార్లు భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంజిబాబు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన గ్రంధి శ్రీనివాస్‌కు 70వేల పైచిలుకు ఓట్లు వస్తే.. పవన్ కల్యాణ్‌తో సమానంగా ఓట్లు తెచ్చుకున్నారు. పవన్‌కు 62వేల ఓట్లు వస్తే అంజిబాబు 54వేల పై చిలుకు ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ పొత్తులో పవన్ కంటే అంజిబాబే సరైన క్యాండేట్ అనే వాదనా వినిపిస్తోంది. స్థానికుడు కావడంతో గ్రంధి శ్రీనును ఎదుర్కోగలిగే అవకాశం ఉంటుందని లెక్కలేస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు కూడా.