తన కసంతా తీర్చుకుంటున్నారా?
తన వైవాహిక జీవితంపై తప్పుడు ఆరోపణలు, కథనాలు రాస్తు, తప్పుడు పోస్టులు పెడుతున్నారంటు కొందరిపై లీగల్ యాక్షన్‌కు పవన్ కల్యాన్ సిద్ధమయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాన్ తన కసినంతా తీర్చుకుంటున్నట్లున్నారు. తన వైవాహిక జీవితంపై తప్పుడు ఆరోపణలు, కథనాలు రాస్తు, తప్పుడు పోస్టులు పెడుతున్నారంటు కొందరిపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు. పవన్ తన మూడో భార్య అనా లెజినోవాకు విడాకులు ఇస్తున్నారని కొన్ని వెబ్‌సైట్లలోను, లెజినోవాయే పవన్‌కు విడాకుల నోటీసులు పంపిందని మరికొన్ని వెబ్ సైట్లలోనూ వార్తలు, కథనాలు వచ్చాయి. అందుకనే వాళ్ళందరికీ జనసేన లీగల్ సెల్ తరపున లీగల్ నోటీసులు పంపారు.
లీగల్ నోటీసుల వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మూడో భార్య, విడాకులన్నది పెద్ద ఇష్యుకాదని అనుమానంగా ఉంది. పవన్ వివాహాలపైన రకరకాల ఆరోపణలు, ప్రచారాలు ఎప్పటినుండో జరుగుతున్నాయి. అయితే వారాహి యాత్ర మొదలైన తర్వాత పవన్ టూర్‌పై కొన్ని వెబ్‌సైట్లు యూట్యూచ్ చానళ్ళల్లో బాగా నెగిటివ్ వార్తలు, కథనాలు వచ్చాయి. యూట్యూబ్ చానళ్ళలో వైసీపీ మద్దతుదారులవి ఉండచ్చు లేదా ఎవరికి వాళ్ళుగా సొంతంగానే నడుపుకుంటున్నవి కూడా ఉన్నాయి.
మొత్తంమీద రివ్యూల్లో అత్యధికం నెగిటివ్‌గానే వచ్చాయి. నెగిటివ్ రివ్యూలంటే కావాలని వ్యతిరేకంగా రాసినవి కావు. పవన్ మాటలు, చేష్టల వల్లే రివ్యూలు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక వైసీపీ నేతలైతే అవుట్ అండ్ అవుట్ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ తీవ్రంగా రెచ్చిపోతున్నారు కాబట్టే పవన్ మీద వైసీపీ నేతలు కూడా అంతేస్థాయిలో రెచ్చిపోతున్నారు. జగన్ వేలు, లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, జగన్ క్రిమినల్ సీఎం అని, తల్లి, చెల్లిని రాష్ట్రం నుండి తరిమేశాడని ఎన్నిసార్లన్నారో లెక్కేలేదు.
జగన్‌ను వ్యక్తిగతంగా పవన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టే పవన్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీవాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. దీనికి అదనంగా వారాహి యాత్రపై ఫుల్లుగా నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. వీటిన్నింటినీ మనసులో పెట్టుకునే పవన్ కొందరు వైసీపీ నేతలకు, వెబ్‌సైట్లకు లీగల్ నోటీసులిచ్చినట్లు అనుమానంగా ఉంది. ఇక్కడ మొదటి నుండి పవన్‌తో సమస్య ఏమిటంటే తాను మాత్రం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. తనను మాత్రం ఎవరు ఏమీ అనకూడదు. ఈ మనస్తత్వం కారణంగానే ప్రత్యర్థులతో గొడవలు లీగల్ నోటీసుల దాకా చేరుకుంది. మరి ఎక్కడ ముగుస్తుందో చూడాలి.