కామన్ సెన్స్ కూడా తక్కువేనా?
భారీ వర్షాలకు నీట మునిగిపోయిన జగనన్న కాలనీలను జనాందరికీ చూపించాలని పవన్ ఆదేశించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తే ఇదే అనుమానం కలుగక మానదు. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లేందుకు ఒక్కరోజు యుద్ధానికి పిలుపిచ్చారు. ఒక్కరోజు యుద్ధమంటే శనివారం ఉదయం నుండి రాత్రి వరకు జగనన్న కాలనీల పరిస్థితులను నేతలు, కార్యకర్తలు వీడియోలు, ఫొటోలు తీయాలని చెప్పారు. వీడియోలు, ఫొటోలు తీసి వాటిని పార్టీ ట్విట్టర్ ఖాతా, వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలట. ఎందుకంటే నీళ్ళల్లో మునిగిపోయిన జగనన్న కాలనీలను జనాందరికీ చూపించాలని పవన్ ఆదేశించారు.
ఓకే పవన్ చెప్పినట్లుగానే అందరు వీడియోలు, ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తే ఏమవుతుంది? కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ వర్షాలకు అమరావతితో సహా చాలా నగరాలు, పట్టణాల్లోని కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని జన జీవనం అస్తవ్యస్థమైపోయింది. ఇందులో దాపరికం ఏమీలేదు, దాచేదీకాదు. ఇదే పద్ధతిలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలు నీట మునగడంలో ఆశ్చర్యమేముంది?
వేలాది మంది పేదలకు పట్టాలిచ్చి, ఇళ్ళు కట్టించాలంటే అవసరమైన భూములు ఊరికి దూరంగానే దొరకుతాయని పవన్‌కు తెలియదా? కొన్ని కాలనీలు ఎత్తైన ప్రాంతాల్లో ఏర్పాటైతే మరికొన్ని కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటవుతాయి. లోతట్లు ఏరియాల్లో ఉండే కాలనీలు సహజంగానే వర్షాలకు ఎఫెక్ట్ అవుతాయి. జగనన్న కాలనీలే కావు గత ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన కాలనీల్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంటాయనటంలో సందేహంలేదు.
ఇపుడు జగన్ కాదు రేపు ఇకెవరు సీఎం అయినా కట్టించి ఇచ్చే కాలనీల పరిస్థితి ఇలాగే ఉంటుందని పవన్‌కు అంతమాత్రం తెలియదా? ఇంతోటిదానికి వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటం ఏమిటో అర్థంకావటంలేదు. భారీ వర్షాలకు జగనన్న కాలనీలు మునిగిపోయాయి సరే మరి చాలా చోట్ల చాలా కాలనీలు కూడా మునిగిపోయాయి కదా? దానికి పవన్ ఏమని సమాధానం చెబుతారు? భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయన్న కామన్ సెన్స్ కూడా పవన్‌కు లేకపోవటమే విచిత్రంగా ఉంది.