ముద్రగడ కుటుంబంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుమార్తెకు జనసేన టికెట్ ఇస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
పిఠాపురంలో పవన్ కి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ప్రచారం ముమ్మరం చేసిన నేపథ్యంలో వెంటనే టీడీపీ.. ముద్రగడ కుమార్తెను తెరపైకి తెచ్చింది. తండ్రికి వ్యతిరేకంగా ఆమెతో మాట్లాడించారు టీడీపీ నేతలు. ముద్రగడ కుటుంబంలో గొడవలున్నాయనే సీన్ క్రియేట్ చేశారు. ఈ వ్యవహారంపై ముద్రగడ స్పందనను కూడా వెటకారం చేస్తూ రచ్చ రచ్చ చేశారు. తాజాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ముద్రగడ కుటుంబంపై స్పందించడం విశేషం. ముద్రగడ కుమార్తె, అల్లుడు ఈరోజు పవన్ కల్యాణ్ ని కలిశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె, అల్లుడు pic.twitter.com/Q7QOWMFRXf
— JanaSena Party (@JanaSenaParty) May 5, 2024
అసలు ముద్రగడ పద్మనాభంకు కుమార్తె ఉందన్న విషయం తనకు తెలియదన్నారు పవన్ కల్యాణ్. తనకు మద్దతుగా ఆమె మీడియా ముందుకు వచ్చిన తర్వాతే ఆమె ముద్రగడ కుమార్తె అని తెలిసిందని పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబంలో గొడవలు పెట్టాలని తాను అనుకోవట్లేదని చెప్పారు. ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానన్నారు పవన్. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో ముద్రగడ కుమార్తెకు జనసేన టికెట్ ఇస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.
కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని అంటున్న పవన్, మెజార్టీ కోసమే మనమంతా కలిసి పని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే తాను పొత్తులు పెట్టుకున్నానని చెప్పారు. భవిష్యత్ అంతా మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.