Telugu Global
Andhra Pradesh

కాపులంతా నాకే ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని..

కాపులు ఐక్యంగా ఉంటే కేవలం ఏపీలోనే కాదని, దక్షిణాది రాజకీయాల్లోనే పెద్ద పాత్ర పోషించవచ్చని అన్నారు పవన్ కల్యాణ్. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోలేదని, నిర్మొహమాటంగానే ఉంటానన్నారు.

కాపులంతా నాకే ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని..
X

కాపులంతా తనకే ఓటు వేస్తే ఈ పాటికే తాను ఎమ్మెల్యేని అయి ఉండేవాడినని, గాజువాక, భీమవరం రెండు చోట్లా భారీ మెజార్టీతో గెలిచేవాడినని అన్నారు పవన్ కల్యాణ్. కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాపుల రాజకీయ సాధికారత గురించి మాట్లాడారు. కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని ఆకాంక్షించారు. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

కులంనుంచి నేను పారిపోను..

కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ప్రస్తుతం రాజకీయాల్లో ఎక్కువయ్యారని చెప్పారు పవన్ కల్యాణ్. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా కాపులు ఉన్నారని గుర్తు చేశారు. పెద్ద కులాలతో గొడవలు వద్దని, అన్ని కులాలను సమానంగా చూడాలని పిలుపునిచ్చారు. కులం నుంచి తానెప్పుడూ పారిపోలేదన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారని విషప్రచారం జరిగిందని, సమాజాన్ని విడగొట్టేవారే ఇలాంటి దుష్ప్రచారం చేశారని చెప్పారు.


దక్షిణ భారత్ లోనే పెద్ద పాత్ర మనది..

కాపులు ఐక్యంగా ఉంటే కేవలం ఏపీలోనే కాదని, దక్షిణాది రాజకీయాల్లోనే పెద్ద పాత్ర పోషించవచ్చని అన్నారు పవన్ కల్యాణ్. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోలేదని, నిర్మొహమాటంగానే ఉంటానన్నారు. కాపుల ఆత్మగౌరవం తగ్గించే పని తాను ఎప్పటికీ చేయబోనని, వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తానన్నారు. ఇతర పార్టీల అజెండా కోసం తాను పనిచేయనని చెప్పారు. పదేళ్లుగా రాజకీయాల్లో అనేక మాటలు పడ్డానని, అలాంటి అవసరం అసలు తనకు లేదన్నారు.

వైసీపీని రిజర్వేషన్లు అడగరా..?

గత ప్రభుత్వంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నించారు పవన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకం అని జగన్ చెప్పినా కూడా, కుల ఆత్మగౌరవాన్ని చంపుకొని మరీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. 2024 ఎన్నికలు చాలా కీలకం అని, సంఖ్యాబలాన్ని అనుసరించి కాపులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.


మీరు ఎవరితో వెళ్లినా మీవెంటే..

కాపు సంక్షేమ సేన తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేగొండి హరిరామజోగయ్య.. పవన్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఏ పార్టీతో జనసేన పొత్తుకు వెళ్ళినా తమకు పర్వాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి సీటులో పవన్ కల్యాణ్ మాత్రమే కూర్చోవాలని, కాపులకు ఆయన ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. జగన్ పోవాలి – పవన్ రావాలి అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు.

First Published:  12 March 2023 6:07 PM IST
Next Story