నన్ను బీసీలతో తిట్టిస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఆవేదన
రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు పవన్ కల్యాణ్. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు.
తనను ఒక కులానికి మాత్రమే పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. తనను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారని అన్నారు. తాను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదని, ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని చెప్పారాయన.
మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో జరిగిన బీసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. బీసీలు రాజ్యాధికారాన్ని అర్థించకూడదని, సాధించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు పవన్ కల్యాణ్. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో బీసీల్లో 93 కులాలు ఉండేవని, అవి ఇప్పుడు 140కి పెరిగాయని, కారణం ఏంటని ప్రశ్నించారు. మిగతా కులాల వారు బీసీలుగా 93 కులాలకు రావాల్సిన ప్రయోజనాలను పొందుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ స్పందించాలన్నారు. అన్యాయంపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలన్నారు.
బీసీ కులాల తొలగింపుపై వైసీపీ, టీడీపీ కూడా స్పందించాలన్నారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందన్నారు పవన్ కల్యాణ్. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు జనసేన తరపున ఏం చేయగలో ఆలోచిస్తామని చెప్పారు.
మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను అందరూ హేళన చేస్తున్నారని, బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.