Telugu Global
Andhra Pradesh

చాలా కాలం తర్వాత నాకు తిక్కరేగింది –పవన్

గతంలో నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకోడానికి వెళ్తే నాయకులు అడ్డుకున్నారని, ఆ సమయంలో ఎన్జీవోని ఏర్పాటు చేసి పేదలకు సాయం చేయాలనుకున్నానని, కానీ ఆ తర్వాత అది సాధ్యం కాక రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్.

చాలా కాలం తర్వాత నాకు తిక్కరేగింది –పవన్
X

పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్-2 కార్యక్రమంలో రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి వచ్చింది. తొలి భాగాన్ని పూర్తిగా పవన్ పర్సనల్ వ్యవహారాలతో నడిపించేసిన బాలకృష్ణ, రెండో ఎపిసోడ్ లో రాజకీయాలపై ప్రశ్నలు సంధించారు. పవన్ అభిమానులకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చుతుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగులు పేల్చారు.

నా తిక్క మళ్లీ వచ్చింది..

నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్. రియల్ లైఫ్ లో పవన్ ఎక్కడా దాన్ని వాడలేదు కానీ, తాజాగా వైసీపీ రాజకీయాలతో ఆ తిక్క తిరిగొచ్చిందని చెప్పారాయన. ఇప్పటం గ్రామంలోకి వెళ్లే సమయంలో ప్రభుత్వం తనను అడ్డుకుందని, పోలీసులు తనను అక్కడికి వెళ్లకుండా ఆపేశారని చెప్పుకొచ్చారు పవన్. రోడ్డుపై నడవకూడదు, కారు దిగకూడదు, రూమ్‌ లో ఉండకూడదు, రూమ్‌ నుంచి బయటకు రాకూడదు అంటూ సవాలక్ష ఆంక్షలు పెట్టారని, అవన్నీ విన్న తర్వాత నాకు కొంచెం తిక్క వచ్చిందని, అందుకే ఎవరు ఆపుతారో చూద్దామంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నానని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెళ్తానంటూ.. ఇప్పటం వెళ్లానని గుర్తు చేశారు.

ఒళ్లు దాచుకోకుండా కష్టపడతా..

కష్టపడేతత్వాన్ని అన్నయ్య చిరంజీవి నుంచి అలవరుచుకున్నానన్నారు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి, ఎలాంటి విమర్శనైనా భరించాలనే దాన్ని కూడా ఆయన నుంచే నేర్చుకున్నానని చెప్పారు. సద్విమర్శ వల్ల మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక అంతటి నమ్మకం పొందాలంటే చాలా సమయం పడుతుందని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్నారు. ప్రస్తుతానికి తాను నమ్మకాన్ని సంపాదించుకునే పరిస్థితిలోనే ఉన్నానన్నారు పవన్.

గతంలో నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకోడానికి వెళ్తే నాయకులు అడ్డుకున్నారని, ఆ సమయంలో ఎన్జీవోని ఏర్పాటు చేసి పేదలకు సాయం చేయాలనుకున్నానని, కానీ ఆ తర్వాత అది సాధ్యం కాక రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్‌ డమ్‌ రాజకీయాల్లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారని, ఎన్టీఆర్, ఎంజీఆర్ విషయంలో అది జరిగిందని, కానీ అందరికీ అలా జరగదనే స్పష్టత తనకు ఉందన్నారు. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు పవన్ కల్యాణ్.

First Published:  10 Feb 2023 6:40 AM IST
Next Story