హోటల్ లోనే పవన్ హౌస్ అరెస్ట్.. ఈరోజు మళ్లీ టెన్షన్..
పవన్ మూడు రోజుల పర్యటనలో నేడు ఆఖరు రోజు. ఈరోజు కూడా ఆయన్ను సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని పోలీసులు చెబుతారా లేక వెసులుబాటు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
విశాఖ విడిచి వెళ్లిపోవాలంటూ ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ కి పోలీసులు డెడ్ లైన్ పెట్టినా ఆయన వెళ్లలేదు. చివరకు పోలీసులే ఆయన్ను హోటల్ గదినుంచి బయటకు రావొద్దని సూచించారు. ఆ తర్వాత ఆయన హోటల్ గదినుంచే బయట నిలబడి ఉన్న అభిమానులకు అభివాదం చేశారు. తనని అక్రమంగా గదిలో నిర్బంధించారని, తాను బయటకు రాకూడదని పోలీసులు కోరుకుంటున్నారని వరుసట్వీట్లు పెట్టారు పవన్ కల్యాణ్. రుషికొండ ఆక్రమణలకు గురవుతుందంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు.
"ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడ కెళ్తోవోచ్
రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా
మా వైసీపీకి ఇస్తావా, మా థానోస్ గూట్లో పెడతావా.. " అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత రాత్రికి హోటల్ నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. ప్రమాదవశాత్తు ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ ఆర్ధిక సాయం అందించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 12 కుటుంబాలకు రూ.60 లక్షల చెక్కులు అందించారు. జనవాణి కార్యక్రమంలో ఈ చెక్కులు అందించాల్సి ఉందని, కానీ ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇలా హోటల్ రూమ్ లోనే చెక్కుల పంపిణీ చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు జనసేన నాయకులు.
బీజేపీ మంతనాలు..
పవన్ కల్యాణ్ పై ఆంక్షల నేపథ్యంలో చంద్రబాబు కాస్త ముందుగా ఫోన్ చేసి హడావిడి చేశారు. కాస్త ఆలస్యంగా బీజేపీ నేతలు కూడా పవన్ కల్యాణ్ ని కలిశారు. ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం నోవాటెల్ కి వచ్చి పవన్ తో మంతనాలు జరిపింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చంద్రబాబు, సోము వీర్రాజు ఫోన్ ద్వారా తనకు సంఘీభావం తెలిపారని, అక్రమ అరెస్ట్ లను వారు ఖండించారని చెప్పారు పవన్ కల్యాణ్.
పవన్ మూడు రోజుల పర్యటనలో నేడు ఆఖరు రోజు. ఈరోజు కూడా ఆయన్ను సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని పోలీసులు చెబుతారా లేక వెసులుబాటు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆదివారం మొత్తం నోవాటెల్ కే పరిమితమైన పవన్ ఈరోజు పార్టీ నాయకుల్ని కలవాల్సి ఉంది. పోలీసులు అనుమతివ్వకపోతే, మరోసారి విశాఖలో ఉద్రిక్తత నెలకొంటుందనే అనుమానాలున్నాయి.