తాటతీస్తా, తోలు తీస్తా.. మళ్లీ పాత కథే చెబుతున్న పవన్
తనను తిట్టడానికి మాత్రమే కాపు ఎమ్మెల్యేలు, నాయకులను సీఎం జగన్ ఉపయోగించుకున్నారని మండి పడ్డారు పవన్. ఎన్డీఏ కూటిమి అధికారంలోకి వస్తే చర్చిలు మూతపడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
వైరి వర్గాల తాట తీస్తా, తోలు తీస్తానంటూ.. వారాహి ఫస్ట్ ట్రిప్ లో తెగ హడావిడి చేశారు పవన్ కల్యాణ్. 21 సీట్లతో సర్దుబాటు చేసుకున్న తర్వాత ఆయన గొంతు ఆ స్థాయిలో పెగల్లేదు. మళ్లీ ఇప్పుడు అదే రూట్లోకి వచ్చేశారు పవన్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ గూండాల తాట తీస్తానంటూ కోరుకొండ సభలో హెచ్చరించారు .రాజానగరం నియోజకవర్గంలో గంజాయి, ఇసుక దోపిడీ, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయని అన్నారాయన. ఇక్కడ జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజల్ని కోరారు పవన్.
కత్తి ఇస్తా..
ప్రజల చేతికి తాను కత్తి ఇస్తానని, తప్పు చేస్తే తన తల నరకాలని ఆవేశంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. తానెప్పుడూ తప్పు చేయలేదని, తప్పు చేస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టబోనని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కు 2 వేల కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పారంటూ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు పవన్. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ ఈబీసీ సౌకర్యం కల్పిస్తామన్నారని, చివరకు అది కూడా ఇవ్వలేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈబీసీ రిజర్వేషన్ తీసేశారని, ఇది కాపులకు ఆయన చేసిన అన్యాయం అని చెప్పారు పవన్.
తనను తిట్టడానికి మాత్రమే కాపు ఎమ్మెల్యేలు, నాయకులను సీఎం జగన్ ఉపయోగించుకున్నారని మండి పడ్డారు పవన్. ఎన్డీఏ కూటిమి అధికారంలోకి వస్తే చర్చిలు మూతపడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు అన్ని కులాలు సమానం అని చెప్పారు. అందుకే గతంలో క్రిస్టియన్ పాత్ర హీరోగా జానీ సినిమా తీశానన్నారు. తాను అన్ని కులాలు, మతాలను ప్రేమిస్తానన్నారు. పోలీస్ శాఖలో కొందరు ఉద్యోగులు.. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పవన్.