పవన్ చేయాల్సింది ఏమిటో తెలుసా?
బీజేపీతోనే ఉండాలా? లేక తెగతెంపులు చేసుకోవాలా? అనే విషయంలో నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబుతో పవన్ ఎన్నిభేటీలు జరిపినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీళ్ళ భేటీ దాదాపు గంటకుపైగా జరిగింది. ఏమి మాట్లాడుకున్నారనేది పక్కన పెట్టేద్దాం. ఇటీవల కాలంలో వీళ్ళిద్దరు భేటీ అవ్వటం ఇది మూడోసారి. ఒకవైపు బీజేపీతో పవన్ మిత్రపక్షంగా ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే చంద్రబాబు-పవన్ ఎన్నిసార్లు భేటీ అయితే మాత్రం ఏమిటి ఉపయోగం? చంద్రబాబుతో పవన్ చేతులు కలపటం అన్నది పెద్ద విషయం కానేకాదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కసి తీర్చుకోవటానికి పవన్‌కు ఉన్న ఏకైక మార్గం చంద్రబాబుతో చేతులు కలపటమే. జగన్ మీద పవన్ కసి తీరాలంటే బీజేపీతో మాత్రమే జతకడితే సరిపోదు. అయితే పవన్ మరచిపోతున్న విషయం ఒకటుంది. అదేమిటంటే బీజేపీతో పొత్తు విషయాన్ని ఫైనల్ చేసుకోవటం. బీజేపీతోనే ఉండాలా? లేకపోతే తెగతెంపులు చేసుకోవాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. బీజేపీ విషయంలో నిర్ణయం తీసుకోకుండా చంద్రబాబుతో పవన్ ఎన్నిభేటీలు జరిపినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదర్చటం పవన్ వల్ల కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చేంత సీన్ పవన్‌కు లేదు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలా? వద్దా అన్నది నిర్ణయించాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే లాభమా? నష్టమా? అన్నది మోడీ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు వల్ల బీజేపీ దెబ్బతిన్నది. అలాగే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత మోడీతో పాటు తల్లి, భార్యను చంద్రబాబు ఎంతగా టార్గెట్ చేశాడో అందరికీ తెలిసిందే.
ఇదే సమయంలో కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారు. నమ్మకంగా ఉన్న జగన్‌తో కంటిన్యూ అవ్వాలా? లేకపోతే ఏమాత్రం నమ్మేందుకు వీలులేని చంద్రబాబుతో మళ్ళీ చెలిమి చేయాలా అన్నది మోడీకి తెలియదా? కాబట్టి పవన్ ముందు తేల్చుకోవాల్సింది ఏమిటంటే బీజేపీతో కంటిన్యూ అవ్వాలా? వద్దా.. అని, అలాకాకుండా బీజేపీతో ఉంటూ చంద్రబాబుతో ఎన్నిసార్లు భేటీలు జరిపినా ఎలాంటి ఉపయోగం ఉండదు.