రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు.. జనసేనలో కొనసాగుతున్న అయోమయం
యనమల భాస్కరరావును జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై పార్టీలో సానుకూలత లేదని తెలియడంతో పాటు మిత్రపక్షం టీడీపీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో అభ్యర్థిని మార్చినట్లు జనసేన చెబుతోంది.
జనసేనకు పొత్తులో దక్కినవి 21 సీట్లు. ఆ 21 సీట్లకే అభ్యర్థులను వెతుక్కోలేక.. ఎంపిక చేసినవారు అభ్యర్థిగా సరిపోరేమోనన్న అనుమానాలు ఓ పక్క.. ఆ సీట్లలోనే పోటీకి పాకులాడుతున్న కొత్తవాళ్లు మరోపక్క.. ఇలా జనసేన పార్టీలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తాజాగా రైల్వేకోడూరులో అభ్యర్థిని మార్చింది.
అరవ శ్రీధర్‌కు ఛాన్స్
రైల్వేకోడూరులో ఇప్పటికే యనమల భాస్కరరావును జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై పార్టీలో సానుకూలత లేదని తెలియడంతో పాటు మిత్రపక్షం టీడీపీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో అభ్యర్థిని మార్చినట్లు జనసేన చెబుతోంది. ఈ స్థానంలో ముక్కావారిపల్లె సర్పంచ్ అరవ శ్రీధర్‌కు ఛాన్సిచ్చింది. శ్రీధర్ రెండు రోజుల కిందటే జనసేనలో చేరడం గమనార్హం.
చంద్రబాబుకు నచ్చలేదనే మార్పు!
వాస్తవానికి భాస్కరరావు అభ్యర్థిత్వం జనసేన కంటే టీడీపీకే ఎక్కువ నచ్చలేదు. అందుకే పవన్ కల్యాణ్ కంగారుపడి అభ్యర్థిని మార్చారు. అవనిగడ్డలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారందర్నీ పక్కనపెట్టి టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌ను జనసేనలో చేర్చుకుని టికెటివ్వడం ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. ఇలా రోజుకో అభ్యర్థిని మార్చుకుంటే పోతే ఇక పార్టీకి విలువేముంటుందని జనసైనికులు ఆవేదన చెందుతున్నారు.