బస్సు యాత్రకు పవన్ రెడీ.. మూడు రోజుల్లో షెడ్యూల్ ఖరారు..
బస్సులో అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. బస్సుపై నుంచే పవన్ ప్రసంగం, అందులోనే విశ్రాంతి, అక్కడే బస చేసేలా పూర్తి హంగులతో బస్సు రెడీ చేస్తున్నారు. చైతన్య రథాన్ని అక్టోబర్ 5 నుంచి పరుగులు పెట్టించబోతున్నారు పవన్.
అక్టోబర్ 5 నుంచి పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారు చేసే పనిలో జనసేన నాయకులు తల మునకలై ఉన్నారు. ఈ నెల 18న మంగళగిరి జనసేన కార్యాలయంలో బస్సు యాత్రకు సంబంధించి కీలక సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో టూర్ షెడ్యూల్ ఖరారవుతుంది.
బస్సు రెడీ..
పవన్ యాత్ర కోసం ప్రత్యేకంగా బస్సుని రెడీ చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ చైతన్య రథంపై రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. దాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అలాంటి చైతన్య రథాన్నే రెడీ చేయిస్తున్నారు. బస్సులో అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. బస్సుపైనుంచే పవన్ ప్రసంగం, అందులోనే విశ్రాంతి, అక్కడే బస చేసేలా పూర్తి హంగులతో బస్సు రెడీ చేస్తున్నారు. చైతన్య రథాన్ని అక్టోబర్ 5 నుంచి పరుగులు పెట్టించబోతున్నారు పవన్.
మూడు రాజధానులపై పవన్ స్టాండ్ ఏంటి..?
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఐవైఆర్ కృష్ణారావు రాసిన 'ఎవరిది ఈ రాజధాని' అనే పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారని, ఆ సందర్భంలో ఆయన అమరావతిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల పవన్ ని కార్నర్ చేశారు. అసలు అమరావతిపై పవన్ స్టాండ్ ఏంటని నిలదీశారు. రాయలసీమ నుంచి యాత్ర మొదలు పెట్టాలనుకుంటున్న పవన్ మూడు రాజధానులపై తమ పార్టీ విధానం ఏంటో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఈ యాత్ర తర్వాతే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ నిర్థారించుకునే అవకాశముంది. బస్సు యాత్ర విషయంలో అటు పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ జనంలోకి వస్తే పార్టీకి ఊపొస్తుందని భావిస్తున్నారు జనసేన నేతలు.